ఆ ఇద్దరిలో ఎవరు... న్యాయం ఎవరికి... నలిగిపోతోన్న చంద్రబాబు..?
ఈ క్రమంలో అనేక వివరణలు ఇచ్చారు. వలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రజలకు మేలు చేసే వ్యవస్థను కొనసాగిస్తామని కూడా చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వలంటీర్ వ్యవస్థ.. వలంటీర్ వ్యవహారం.. కీలక రాజకీయ అంశంగా మారిపోయిన విషయం తెలిసిందే. వైసీపీ సర్కారుకు కళ్లు-చెవులు అన్నట్టుగా వలంటీర్లు పనిచేస్తున్నారని.. వీరు ఎన్నికలను , ఓటర్లను కూడా.. ప్రభావితం చేస్తారని.. కాబట్టి వీరిని ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రజల వద్దకు వెళ్లకుండా అడ్డుకోవాలని.. కోరుతూ.. సిటిజన్స్ ఫర్ డెమొక్రటిక్(సీఎఫ్‌డీ) సభ్యులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని విన్నించారు.
దీంతో ఎన్నికల సంఘం వలంటీర్ వ్యవస్థను ప్రజలకు దూరంగా ఉంచింది. ఈ పరిణామంతో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య రాజకీయ ఫైట్ ఓ రేంజ్‌లో సాగింది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకానొక దశలో భీతిల్లారనే చెప్పాలి. వలంటీర్లకు-ప్రజలకు మధ్య అవినాభావ సంబంధం పెరిగిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా వలంటీర్లను పక్కన పెడితే.. ప్రజాగ్రహం పెల్లుబికి.. పార్టీ పరిస్ధితి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆయన తలపోశారు.
ఈ క్రమంలో అనేక వివరణలు ఇచ్చారు. వలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదన్నారు. ప్రజలకు మేలు చేసే వ్యవస్థను కొనసాగిస్తామని కూడా చంద్రబాబు చెప్పారు. ఒకరకంగా.. చెప్పాలంటే.. రాష్ట్రంలో ని అన్ని సమస్యలకుతోడు వలంటీర్ వ్యవస్థ మరో సమస్యగా ఎన్నికల సమయంలో సవాల్ రేపింది. అయితే.. ఎన్నికలు ముగిశాయి. టీడీపీ కూటమి విజయ దుందుభి మోగించింది. కనీ వినీ ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున మెజారిటీ దక్కించుకుని అధికారం చేపట్టింది.
అంటే. వైసీపీ ప్రవచిత వలంటీర్ వ్యవస్థ ఎక్కడా పనిచేయలేదు. ప్రజలకు-వలంటీర్లకు మధ్య అవినా భావ సంబంధమే ఉన్నప్పటికీ.. ప్రజలు వారిని పట్టించుకోలేదు. తాము కోరుకున్న పార్టీకే ప్రజలు బటన్ నొక్కారు. కట్ చేస్తే.. ఇప్పుడు టీడీపీ కూటమి సర్కారు వలంటీర్లను కొనసాగించాలా? వద్దా? అనే సందేహంలో పడిపోయింది. వలంటీర్లను కొనసాగిస్తే.. కార్యకర్తలపై ప్రభావం పడుతుంది. పోనీ.. సాహసం చేసైనా వలంటీర్లను కొనసాగిద్దామంటే.. వారివల్ల ప్రయోజనం ఉండదని తాజా ఎన్నికలు రుజువు చేశాయి. దీంతో ఇప్పుడు వలంటీర్లు కొనసాగించడమా? వద్దా? అనే విషయంపై టీడీపీ ఆలోచన చేస్తున్నారు.