ఆ పార్టీల బంఫర్ ఆఫర్.. పోటీ చేస్తారా.. టికెట్లు ఇస్తారట!
వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ఆయన పలుమార్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రజాశాంతిలో చేరితే ఆయనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగితేలుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.
ఇక సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్ నేషనల్ పార్టీ, ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ నేతృత్వంలోని జై భారత్ భీంరావు పార్టీ, రామచంద్రయాదవ్ నేతృత్వంలోని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై), కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలు రంగంలో ఉన్నాయి.
ఇప్పటికే అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్ష కూటమి జనసేన, టీడీపీ, బీజేపీల్లో సీట్లు రావనుకుంటున్న అభ్యర్థులు, ఇప్పటికే ప్రకటించిన సీట్లలో రాని అభ్యర్థులు వేరే పార్టీల్లో చేరికకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా సీట్లు రానివారని వైఎస్ షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఆకర్షిస్తోంది.
మరోవైపు రాజకీయాల్లో ఆటలో అరటి పండులా అందరూ భావిస్తున్న కేఏ పాల్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ఆయన పలుమార్లు ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ప్రజాశాంతిలో చేరితే ఆయనను ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు.
ఇంకోవైపు సీట్లు రానివారికి కేఏ పాల్ వల వేస్తున్నారు. అయితే ఎవరూ కేఏ పాల్ ను పట్టించుకోవడం లేదు. దీంతో స్వయంగా ప్రజాశాంతి పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని యువతకు ఫోన్లు వస్తున్నాయని తెలుస్తోంది.
ప్రజాశాంతి పార్టీలో చేరాలని.. పార్టీలో చేరితే సీట్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చాలా సీట్లకు అభ్యర్థులు ఖరారై పోయారని.. ఇంకా ప్రతి జిల్లాలో రెండు చొప్పున మాత్రమే ఖాళీలు ఉన్నాయని చెబుతున్నారట. ఆలసించిన ఆశాభంగం తప్పదని.. తమ పార్టీలో చేరాలని.. చేరి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయాలని ఆ పార్టీ తరఫున వ్యక్తుల నుంచి యువతకు పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నాయని తెలుస్తోంది.
వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని.. లేకపోతే టికెట్లు అయిపోతాయని.. టికెట్లు అయిపోతే తాము చేయగలిగేది ఏమీ ఉండదని.. ఇలా యువతకు ప్రజాశాంతి పార్టీ కార్యాలయం నుంచి ఫోన్లు వస్తున్నాయని సమాచారం.
కేవలం ప్రజాశాంతి పార్టీ నుంచే కాకుండా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని జై భారత్ నేషనల్ పార్టీ, జడ శ్రావణ్ కుమార్ నేతృత్వంలోని జై భారత్ భీంరావు పార్టీ, రామచంద్రయాదవ్ నేతృత్వంలోని బీసీవై పార్టీ, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీపార్టీల నుంచి కూడా రాష్ట్రంలోని యువతకు పెద్ద ఎత్తున ఫోన్లు వస్తున్నట్టు తెలుస్తోంది.