ఉచిత హామీలపై రిజర్వు బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ హాట్‌ కామెంట్స్‌!

ప్రతి ఎన్నికల ముందు ఎప్పటి నుంచో దేశమంతా చర్చ జరుగుతున్న అంశం.. ‘ఉచిత పథకాలు’

Update: 2024-04-21 09:30 GMT

ప్రతి ఎన్నికల ముందు ఎప్పటి నుంచో దేశమంతా చర్చ జరుగుతున్న అంశం.. ‘ఉచిత పథకాలు’. ఎన్నికల్లో గెలుపొందడానికి ఆయా పార్టీలు ఇచ్చే ఉచిత హామీలు, ఉచిత పథకాలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కట్టిన పన్నులను అభివృద్ధికి, మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఖర్చు చేయకుండా పప్పుబెల్లాల్లాగా, తాయిలాలు మాదిరిగా పంచిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

అయితే దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఎన్నికల్లో గెలుపొందడానికి ఉచిత పథకాలపైనే ఆధారపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత పథకాల విషయంలో రాజకీయ పార్టీలపై ఆంక్షలు విధించే అంశంపై సమగ్ర చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఆయా పార్టీల మధ్య ఏకాభిప్రాయం అవసరమని అన్నారు. ఇందుకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు.

అలాగే ఉచిత హామీల విషయంలో శ్వేతపత్రం కూడా విడుదల చేయాల్సిన అవసరం ఉందని దువ్వూరి సుబ్బరావు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఈ ఉచిత హామీల అమలు వల్ల అయ్యే ఖర్చును, లాభనష్టాలను ప్రజలకు వివరించాలన్నారు.

భారత్‌ వంటి పేద దేశాల్లో నిరుపేదలకు ప్రభుత్వపరంగా సాయంగా అందించాలని.. అయితే అది ఎంతవరకనేది నిర్ణయించుకోవాలన్నారు. ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలన్నారు.

ద్రవ్య బాధ్యత బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) ను కొన్ని రాష్ట్రాలు దాటిపోవటం, పరిమితిని మించి అప్పులు చేయడం సరికాదని దువ్వూరు సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. ముఖ్యంగా ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి కట్టుబడి ఉండాలన్నారు.

అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించాలంటే వాతావరణ మార్పులు, భౌగోళికంగా తలెత్తే రాకీయ సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందన్నారు. ఇలా అయితేనే 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని చెప్పారు. అది కూడా 7.6 శాతం వృద్ధిరేటు సాధిస్తేనే అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ కల సాకారమవుతుందన్నారు.

ఈ నేపథ్యంలో దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌ గా మారాయి. ఉచిత పథకాల విషయంలో గతంలో కొందరు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఆయా పార్టీలు ఉచిత పథకాలను ప్రకటించకుండా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. అయితే కోర్టు తోసిపుచ్చింది. ఏవి ఉచిత పథకాలో, ఏవి ఉచిత పథకాలు కావో ముందు చర్చ జరగాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.

Tags:    

Similar News