దేశంలో గాడి త‌ప్పేసిన 'భావ ప్ర‌క‌ట‌నా' స్వేచ్ఛ‌!

ఇప్పుడు ప్ర‌జాస్వామ్యానికి, ముఖ్యంగా భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు ప‌ట్టిన దుర్గ‌తి!

Update: 2024-10-14 12:30 GMT

దేశంలో భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ గాడి త‌ప్పేసింది. ఎవ‌రైనా చిన్న‌స్థాయిలో ఉన్న‌వారు నోటికి ప‌నిచెబితే.. పెద్ద‌లైన వారు స‌రిదిద్దాలి. దేశంలో కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు ఇలానే న‌డిచింది. చిన్న‌నేత‌లు త‌ప్పులు చేసిన‌ప్పుడు అది ఏపార్టీ అయినా.. ఆయా పార్టీ్ల లో ఉన్న‌ పెద్ద‌లు స‌రిదిద్దేవారు. కానీ, పెద్ద నేత‌లే రోడ్డున ప‌డితే? మంచినీళ్ల కుళాయి ద‌గ్గ‌ర కీచులాడుకున్న‌ట్టు కీచులాడుకుంటే.. ఎవ‌రు మాత్రం అడ్డు చెప్ప‌గ‌ల‌రు? ఎవ‌రు మాత్రం వారిని స‌రిదిద్ద‌గ‌ల‌రు? ఇదీ.. ఇప్పుడు ప్ర‌జాస్వామ్యానికి, ముఖ్యంగా భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌కు ప‌ట్టిన దుర్గ‌తి!

బీజేపీతో మొద‌లైన ఈ వివాదం.. ఇప్పుడు కాంగ్రెస్ వ‌ర‌కు చేరింది. ఒక‌రిపై ఒక‌రు కీచులాడుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా ఎక్క‌డైనా ఎన్నిక‌లు వ‌స్తే.. చాలు అగ్ర‌నేత‌లు సైతం పూనకం వ‌చ్చిన‌ట్టు మాట‌లు జారేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ-కాంగ్రెస్ పార్టీల అగ్ర‌నాయ‌కులు కూడా ఇలానే చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న వీరోచిత వాగ్ధాటితో రెచ్చిపోతున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌వారంతా(స‌బ్ కా నేత‌గ‌ణ్ అర్బ‌న్ న‌క్స‌ల్స్ హై) ప‌ట్ట‌ణ న‌క్స‌లైట్లేన‌ని తీర్మానం చేశారు. వాస్త‌వానికి ఈ మాట‌ను కొన్నాళ్ల కింద‌టి వ‌ర‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అనేవారు. ప్ర‌ధానిమాత్రం అర్బ‌న్ న‌క్స‌లైట్ల మ‌ద్ద‌తు ఉంద‌ని చెప్పేవారు.

కానీ తాజాగా అస‌లు కాంగ్రెస్‌లో ఉన్న‌వారంతా అర్బ‌న్ న‌క్స‌లైట్లేన‌ని తీర్మానం చేశారు. దీనికి కౌంట‌ర్‌గా కాంగ్రెస్ కూడా అదే రేంజ్‌లో వ్యాఖ్య‌లు గుప్పించింది. కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే కూడా.. ఈ స్థాయిలోనే మాట‌లు తూలారు. బీజేపీలో ఉన్న‌వారంతో టెర్ర‌రిస్టులేన‌ని చెప్పారు. వారివ‌ల్లే దేశంలో మ‌త‌క‌ల‌హాలు, సామాజిక వివ‌క్ష పెరుగుతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. ``వారే హ‌త్య‌లు చేస్తారు. వారే దాడులు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ వ్య‌క్తుల నోటిలో మూత్రం పోసి ఆనందిస్తారు. అందుకే అది(బీజేపీ) టెర్ర‌రిస్టుల పార్టీ`` అని దుయ్య‌బ‌ట్టారు.

ఎవ‌రు చెబుతారు?

తొలి ప్ర‌ధాని నెహ్రూ ఓ సంద‌ర్భంలో పార్ల‌మెంటులో మాట్లాడుతూ.. ``చూడండి మీరు చిన్న‌వాళ్లు. ఏమైనా మాట్లాడొచ్చు. కానీ, పెద్ద‌లుగా(ప్ర‌ధాని) మేం మాట్లాడే ప్ర‌తి మాట‌ను తూకం వేయాల్సి ఉంటుంది. లేక‌పోతే.. ప్ర‌జ‌ల ముందు చుల‌క‌న‌వుతాం`` అని అప్ప‌టి కాంగ్రెస్‌ ఎంపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అంత‌టి విలువైన స్థానంలో ఉన్న ప్ర‌ధాని మోడీ, అంతే స్థాయిలో గౌర‌వ ప్ర‌ద‌మైన పోస్టులో ఉన్న మ‌ల్లికార్జున ఖ‌ర్గేలే దారి త‌ప్పేస్తే.. ఎవ‌రు మాత్రం వారికి చెబుతారు? అనేది కీల‌క‌ప్ర‌శ్న‌.

Tags:    

Similar News