ముప్పేట దాడి అంటే ఇదే.. జగన్ చుట్టూ పద్మవ్యూహం

పనిలోపనిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా జతకలవడం మరింత ఆసక్తికరంగా మారుతోంది. దీంతో ఈ మాటల దాడిని జగన్ ఎలా ఎదుర్కొంటారనేది చర్చకు తావిస్తోంది

Update: 2025-02-24 18:30 GMT

మాజీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారా? అసెంబ్లీకి వెళ్లనని చెప్పి వెళ్లి వెంటనే వాకౌట్ చేసిన జగన్ పై కూటమి నేతలు అంతా మూకుమ్మడిగా అటాక్ చేయడం రాజకీయంగా హీట్ పెంచుతోంది. పనిలోపనిగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కూడా జతకలవడం మరింత ఆసక్తికరంగా మారుతోంది. దీంతో ఈ మాటల దాడిని జగన్ ఎలా ఎదుర్కొంటారనేది చర్చకు తావిస్తోంది.

ఏపీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజే రాజకీయాన్ని రసకందాయంగా మార్చేశాయి. ప్రతిపక్ష హోదా ఇవ్వనిదే సభలో అడుగుపెట్టనని భీష్మించుకున్న వైసీపీ అధినేత జగన్.. తన ప్రతిజ్ఞను కాసేపు పక్కన పెట్టారు. గవర్నర్ ప్రసంగానికి హాజరై వెంటనే తన ఎమ్మెల్యేలతో వాకౌట్ చేశారు. అయితే ఆ వెంటనే కూటమి నేతలు రంగంలోకి దిగారు. విపక్ష హోదా కావాలంటున్న జగన్ ను టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చుతున్నారు. ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఐదేళ్లు జగన్ ప్రతిపక్ష హోదా అన్న పదం మరచిపోవాల్సిందేనని తేల్చేశారు పవన్. ఇక ఓట్ల శాతం చూసైనా హోదా ఇవ్వాలన్న ప్రతిపాదనకు గోదావరి వెటకారంతో సమాధానం చెప్పారు పవన్.

పవన్ కామెంట్లతో రాజేసిన మంటను మంత్రులు మరింత వేడెక్కించారు. రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడాలంటే ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్ రెడ్డి, పుచ్చపల్లి సుందరయ్య వంటివారు ఎందరో ప్రతిపక్ష హోదా లేకుండానే ప్రజల కోసం పనిచేశారంటూ చురకలు అంటించారు.

మరోవైపు తాను బ్యాలెన్స్ ఉంటే బాగోదనుకున్న జగన్ సోదరి, ఏపీసీసీ చీఫ్ షర్మిల కూడా తనదైన స్టైల్ లో వైసీపీ అధినేతపై విరుచుకుపడ్డారు. జనాలు ఛీ కొడుతున్నా వైసీపీ అధినేత జగన్ తీరు మాత్రం మారలేదని షర్మిల విమర్శించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి 11 నిమిషాలు ఉండటానికా అసెంబ్లీకి వచ్చిందని ప్రశ్నించారు. ప్రజా సమస్యల కన్నా తమకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమాని నిలదీశారు. ‘‘సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో అటెండెన్స్ కోసం వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా ?’’ అంటూ వరుస ప్రశ్నలు వేశారు.

అదేవిధంగా మంత్రి అచ్చెన్నాయుడు సైతం విపక్షంపై ఫైర్ అయ్యారు. 11 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా అడగడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు అచ్చెన్నాయుడు. హాజరు కోసమే వైసీపీ నేతలు సభకు వచ్చారని, వారికి ప్రజా సమస్యలపై ఆసక్తి లేదని విమర్శించారు. సభ్యత్వాలు పోతాయనే భయంతోనే వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చామని భావిస్తున్నట్లు చెప్పారు.

ఇలా కూటమి నేతలు అంతా నలువైపులా వైసీపీని టార్గెట్ చేయడం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. కూటమి ఏకధాటిగా మాటలు దాడి చేస్తున్నా వైసీపీ నుంచి వివరణ లేదా ఎదురుదాడి వంటివేవీ కనిపించలేదు. దీంతో జగన్ కూటమి పద్మవ్యూహంలో చిక్కుకుంటున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. సభకు రాకపోతే అనర్హత వేస్తామని బెదిరించడంతోపాటు వచ్చిన రోజు హాజరు కౌంట్ చేయమని లీకులు ఇవ్వడం వరకు ప్రతిపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహమే కనిపిస్తోందంటున్నారు. 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్, పెద్దిరెడ్డి మాత్రమే అధికార పక్షంపై ఎదురుదాడి చేసే స్థాయి ఉన్న నేతలుగా చెబుతున్నారు. తరచూ మీడియాలో కనిపించే ఎమ్మెల్యే చంద్రశేఖర్ అధికార కూటమిని తట్టుకునేలా మాట్లాడినా, ఈ రోజు అసెంబ్లీలో కండువా లేని ఆయన ఫొటో రిలీజ్ చేసి ఆత్మరక్షణలోకి నెట్టేసింది కూటమి. ఇలా వైసీపీలో క్రియాశీలంగా ఉన్నవారిని టార్గెట్ చేయడమే కాకుండా అధినేతను ఊపిరి సలపనీయనంతలా ఉక్కిరిబిక్కిరి చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.

Tags:    

Similar News