పొంగులేటి బాంబులకు ఇవేం ఊహాగానాలు?

కీలక స్థానంలో ఉన్న నేత నుంచి ఒక మాట వచ్చిందంటే.. దాని వెనుక చాలానే లెక్కలు ఉండొచ్చు.

Update: 2024-10-27 09:30 GMT

కీలక స్థానంలో ఉన్న నేత నుంచి ఒక మాట వచ్చిందంటే.. దాని వెనుక చాలానే లెక్కలు ఉండొచ్చు. ఈ అంశాన్ని వదిలేసి.. ఎవరి మనసుకు తోచింది వారు విశ్లేషణలు చేయటం.. అంచనాలకు వచ్చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. ఎంత సంచలనమైతే మాత్రం.. అందులో అంతో ఇంతో లాజిక్కు లేకుండా ఉండటం అంతంతకు ఎక్కువైపోతోంది. దీనికి తోడు.. అసలేం జరుగుతుందన్న విషయాలకు సంబంధించిన ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లేకపోవటం ఒక సమస్య. ఇదే తరచూ విశ్లేషణలు చేసే వారికి ఎదురవుతున్న ఇబ్బంది. దీంతో.. తమ మనసుకు తోచిన అంశాలే వాస్తవాలుగా ప్రపంచానికి చెప్పే ప్రయత్నంతో నిజాల కంటే కూడా అసత్యాలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి.

రేవంత్ ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ మధ్యన ఒక కీలక వ్యాఖ్య చేశారు. త్వరలో తాను బాంబులాంటి వార్తను చెప్పనున్నట్లు ప్రకటించారు. అంతే.. ఎవరికి వారు తమకు తోచిన విశ్లేషణను తెర మీదకు తీసుకొస్తున్నారు. అవగాహన లేని వారి సంగతిని కాస్త పక్కన పెడదాం. విస్మయానికి గురి చేసే అంశం ఏమంటే.. మీడియాలో కాస్తోకూస్తో పలుకుబడి ఉన్న కొందరు సైతం ఇష్టారాజ్యంగా విశ్లేషణల్ని వండేయటంతో పెద్ద చిక్కుగా మారింది.

దీంతో ఎప్పుడు ఎవరు ఎలాంటి విశ్లేషణలు చేస్తారో తెలియని పరిస్థితి. పొంగులేటి బాంబు లాంటి వ్యాఖ్యకు.. వాస్తవానికి ఏ మాత్రం సూట్ కాని విశ్లేషణను చేయటం.. అది కాస్తా వైరల్ గా మారింది. ఇప్పుడు కొన్ని సెక్షన్లలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకూ ఆ విశ్లేషణ ఏమంటే.. గులాబీ పార్టీలో అత్యంత కీలకమైన వారు ఎవరంటే మొదటి స్థానంలో కేసీఆర్.. రెండో స్థానంలో కేటీఆర్.. మూడో స్థానంలో ఉన్న హరీశ్ రావులను.. వేర్వేరు అంశాలకు సంబంధించిన కేసుల్లో అరెస్టు చేస్తారన్న అంచనాలను వెల్లడించారు.

నిజంగానే.. అంత అవకాశం ఉందా? అన్నదే చూస్తే.. ఏ ప్రభుత్వం కూడా ఇంతటి తెలివితక్కువ నిర్ణయాల్ని తీసుకునే వీల్లేదని చెప్పాలి. ఎందుకంటే.. ప్రముఖులు ఎవరిని అరెస్టు చేసినా.. అదెంత తీవ్రమైన అంశంగా మారుతుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి తోడు అరెస్టు కానంత వరకు లెక్కలు వేరుంటాయి. ఒక్కసారి అరెస్టు అయి.. జైలు జీవితానికి సిద్ధమైతే ప్రజల్లో వెల్లువెత్తే సానుభూతి వేరే స్థాయిలో ఉంటాయి. కొన్ని నెలల క్రితం ఏపీలో అప్పటి సర్కారు తీసుకున్న నిర్ణయాలు.. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల గురించి అవగాహన ఉన్న వారెవరూ కూడా తాజా విశ్లేషణను అంగీకరించే పరిస్థితుల్లో లేరనే చెప్పాలి. ఏమైనా ఇదిగో తోకఅంటే.. అదిగో పులి అనటం ఒక ఎత్తు. అందుకు భిన్నంగా తోక ఇందాక కనిపించింది.. అది కచ్ఛితంగా పులిదే అయి ఉంటుందన్న భావనతో విశ్లేషణలు చేయటమే పెద్ద సమస్య. దాని నుంచి ఎప్పుడు బయటకు వస్తారో చూడాలి.

Tags:    

Similar News