అక్కడ మరో పొంగులేటి..? ఆయనేం చేస్తున్నారు..?
రాజకీయాల్లో లక్ అనేది చాలా కీలకం. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా లక్ మన పక్షాన ఉంటే పదవులు వరిస్తాయి.
రాజకీయాల్లో లక్ అనేది చాలా కీలకం. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా లక్ మన పక్షాన ఉంటే పదవులు వరిస్తాయి. ఇది లేనప్పుడు దశాబ్దాల పాటు ప్రయత్నించినా చిన్న పదవీ దక్కదు. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో తీసుకునే పార్టీ మార్పు నిర్ణయాలు కొందరి రాజకీయ జీవితాలనే మార్చివేస్తాయి. ఇటీవలి తెలంగాణ ఎన్నికలను పరిశీలిస్తే ఈ విషయం మరింత స్పష్టం అవుతంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 2019 నుంచి నాలుగేళ్లు బీఆర్ఎస్ లో కొనసాగి.. జూలైలో కాంగ్రెస్ లో చేరారు. మధ్యలో బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చినా సున్నితంగా తిరస్కరించారు. అనంతరం ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి ఉమ్మడి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ 9 ఎమ్మెల్యే సీట్లను గెలిచేలా చూశారు. ప్రభుత్వం ఏర్పడ్డాక మంత్రి కూడా అయ్యారు. కీలక శాఖలను చూస్తున్నారు.
ఈయన కంటే ముందే ఆ పొంగులేటి
2014 లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మ ఫలితం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనం. నాడు ఖమ్మం ఎంపీగా వైసీపీ తరఫున పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచారు. ముగ్గురు ఎమ్మెల్యేలనూ గెలిపించుకున్నారు. అలాంటి పొంగులేటి 2016 తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అయితే, ఎంపీ టికెట్ మాత్రం దక్కలేదు. కాగా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేరు గత పదేళ్లుగా మాత్రమే రాష్ట్ర ప్రజలకు తెలుసు. వాస్తవానికి ఈయనకు ముందే మరో పొంగులేటి ఉన్నారు. ఆయన పేరు పొంగులేటి సుధాకర్ రెడ్డి.
30 ఏళ్లు కాంగ్రెస్ లో కొనసాగి
పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ దాయాదులు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురం వీరి స్వగ్రామం. సుధాకర్ రెడ్డి 1980ల మధ్యలో కాంగ్రెస్ తరఫున రాజకీయ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పార్టీ అధిష్ఠానానికి చాలా సన్నిహితంగా వ్యవహరించారు. 2007లో ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్సీ కూడా అయ్యారు. ఏఐసీసీ సభ్యుడు అయిన ఆయన 2019లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కాగా, పొంగులేటి సుధాకర రెడ్డి సోమవారం ఖమ్మం లోక్ సభ బీజేపీ ఇంచార్జిగా నియమితులయ్యారు.
ఆయన అటు.. ఈయన ఇటు
పొంగులేటతి శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన ఆరు నెలలకే ఎమ్మెల్యే, మంత్రి కూడా అయ్యారు. సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ లో 35 ఏళ్లు పనిచేసినా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేకపోయారు. ఆపై పార్టీ మారారు. ఇదే రాజకీయ వైచిత్రి అంటే.. కాగా, ఖమ్మంలో మరో పొంగులేటి కూడా పుట్టుకొస్తున్నారు. ఆయన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి. తమ్మడికి ఖమ్మం లోక్ సభ టికెట్ కోసం శ్రీనివాసరెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఒకవేళ దక్కితే గనుక అది విశేషమే.