సుప్రీం కీలక తీర్పుపై పొన్నవోలు ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పులపై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై సుమారు 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు... ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు 17-ఏ ను ఫాలో కాలేదని, ఫలితంగా తన అరెస్టు చెల్లందంటూ స్కిల్ స్కాం కేసుపై సుప్రీంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి తాజాగా తీర్పు వెల్లడైంది. ఈ తీర్పుపై ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పందించారు.
అవును... టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో గుడ్ న్యూస్ వచ్చిందని చెప్పలేని పరిస్థితి తాజాగా తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పులపై అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... గౌరవనీయులైన జస్టిస్ బేలా ఎం.త్రివేది.. 17-ఏ వర్తించదని తెలిపారని అన్నారు. 17-ఏ అనే అమెండమెంట్ ను చూపించి చట్టవ్యతిరేక కార్యక్రమాల నుంచి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం ఈరోజు విఫలమైందని అన్నారు. ఈ ప్రభుత్వంపై బురద జల్లడానికి ఇప్పటివరకూ ఎంతో గ్లోబెల్స్ ప్రచారం చేశారని అన్నారు.
వాస్తవానికి చంద్రబాబుపై కేసు పెట్టింది 5 జూన్ 2018లో అని.. అది గత ప్రభుత్వం హయాంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థల సూచనలతో కేసులు నమోదయ్యాయని అన్నారు! అయినప్పటికీ... న్యాయవాదులపై వ్యక్తిగతంగానూ, ప్రభుత్వంపైనా, వ్యవస్థలపైనా బురదజల్లారని అన్నారు. దీనికి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తీవ్రస్థాయిలో సహకరించిందని తెలిపారు!!
రాజకీయ కక్ష అంటూ చంద్రబాబు చేసిన వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చిందిని.. నేరం బయటపడేసరికి గవర్నర్ అనుమతి అంటూ సాంకేతిక కోణాలు వెతికారని పొన్నవోలు ఫైరయ్యారు. రెండు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించినప్పటికీ... ఎక్కడా ఈ క్వాష్ పిటిషన్ ను కొట్టివేయలేదని పొన్నవోలు స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించలేదని స్పష్టమైందని తెలిపారు.
కాగా... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు సుప్రీంలో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై వెలువరించిన తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... స్కిల్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు ఇవ్వగా.. 17-ఏ వర్తించదని జస్టిస్ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు.