విచారణలో మాజీ మంత్రి జోగిని అడిగితే ఆయన జవాబులు ఇస్తున్నారు

బెయిల్ కోసం మాజీ మంత్రి జోగి రమేశ్ పెట్టుకున్న పిటిషన్ మీద విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా తన వాదనల్ని వినిపించారు

Update: 2024-08-23 04:21 GMT

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న మాజీ మంత్రి జోగి రమేశ్ వ్యవహరిస్తున్న తీరు.. విచారణ వేళ పోలీసులు అడిగే ప్రశ్నలకు ఆయన వ్యవహరిస్తున్న వైనంపై ఏపీ హైకోర్టుకు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపై 2021లో మూకుమ్మడి దాడి చేసిన కేసు విచారణ వేళ మాజీ మంత్రి జోగి రమేశ్ ను ప్రశ్నలు అడిగితే ఆయన వ్యవహరిస్తున్న తీరును హైకోర్టుకు వెల్లడించారు. విచారణ వేళ జోగి రమేశ్ పక్కన కూర్చున్న మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమాధానాలు ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాన్ని హైకోర్టుకు సమర్పించారు.

బెయిల్ కోసం మాజీ మంత్రి జోగి రమేశ్ పెట్టుకున్న పిటిషన్ మీద విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూద్రా తన వాదనల్ని వినిపించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. పోలీసుల దర్యాప్తునకు మాజీ మంత్రి జోగి రమేశ్ సహకరించటం లేదన్న సిద్ధార్థ లూద్రా.. అందుకు సాక్ష్యంగా తీసిన వీడియోను హైకోర్టు పరిశీలించాలని కోరారు.

విచారణకు హాజరు కావాలని మూడు నోటీసులు ఇస్తే.. ఒక్క దానికే స్పందించారని.. వైసీపీ ప్రభుత్వంలో అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఆయన ఇప్పుడు అరెస్టు నుంచి రక్షణ పొందాలని.. కోర్టు ఉత్తర్వులను దుర్వినియోగం చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. దాడి వేళలో వాడిన సెల్ ఫోన్.. సిమ్ నంబరు.. ఐఎంఈఐ నంబరు.. ఫోన్ బిల్లులు.. తదితర వివరాలు అడిగితే ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదని.. ఎక్కువ ప్రశ్నలకు.. తెలీదు.. గుర్తు లేదన్న మాటే చెబుతున్నట్లుగా పేర్కొన్నారు.

పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని జోగి రమేశ్ తీరును హైకోర్టుకు వివరించారు. ‘‘హైకోర్టులో జోగి రమేశ్ బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. జోగి రమేశ్ పక్కనే కూర్చుంటున్నారు. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొన్నవోలు సమాధానాలు ఇస్తున్నారు. ఇలాంటి తీరును గతంలో నేనెప్పుడూ చూడలేదు. చంద్రబాబు ఇంటిపై దాడి ఘటన వెనక ఉన్న కుట్ర కోణాన్ని తేల్చాల్సి ఉంది. అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన ఉదంతంలో స్వల్ప సెక్షన్లుపెట్టారు. అప్పటి ప్రతిపక్ష నేతలు.. బాధితులపై ఎస్సీ.. ఎస్టీ కేసు నమోదు చేయించారు. దర్యాప్తును నీరుగార్చారు. వీటికి సంబంధించిన ఆధారాలతో కూడిన కేసు డైరీని కోర్టు ముందు ఉంచాం’’ అని వెల్లడించారు.

జోగి రమేశ్ ప్రవర్తనను పరిగణలోకి తీసుుకొని ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిష్ ను కొట్టేయాల్సిందిగా హైకోర్టును కోరారు పోలీసుల తరఫు వాదనలు వినిపించిన సిద్ధార్థ లూద్రా. ఈ నేపథ్యంలో హైకోర్టు కేసును ఈ రోజుకు (శుక్రవారం) వాయిదా వేసింది. పోలీసుల తరఫు వాదనలు ముగియటంతో.. పిటిషనర్ తరఫు రిప్లై వాదనలు జరగనున్నాయి. అనంతరం హైకోర్టు తుది నిర్ణయాన్ని తీసుకునే వీలుంది.

Tags:    

Similar News