నెక్ట్స్ నానిలు అనుకుంటే.. పోశానిని వేసేశారు!

వైసీపీ నేతలే టార్గెట్ గా ఏపీలో కొనసాగుతున్న అరెస్టులు అనేక రకాల చర్చకు దారితీస్తున్నాయి. ప్రధానంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత పోలీసులు జోరు చూపిస్తున్నారు.

Update: 2025-02-27 08:06 GMT

వైసీపీ నేతలే టార్గెట్ గా ఏపీలో కొనసాగుతున్న అరెస్టులు అనేక రకాల చర్చకు దారితీస్తున్నాయి. ప్రధానంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత పోలీసులు జోరు చూపిస్తున్నారు. అటు నాని అనుచరులతోపాటు గతంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన నేతలపై కేసుల కొరడా ఝుళిపిస్తున్నారు. అదే సమయంలో వంశీ అరెస్టు తర్వాత నెక్ట్స్ ఎవరు అన్న చర్చ ఎక్కువగా జరిగింది.

టీడీపీ నేతలు సైతం నెక్ట్స్ వీరే అంటూ వైసీపీ నేతల పేర్లను ప్రకటించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా సినీ నటుడు పోశానిని అరెస్టు చేయడంతో వైసీపీ షాక్ తింది. రాజకీయాలకు సెలవంటూ తప్పుకున్న పోశానిని సడన్ గా అరెస్టు చేయడం ఎవరూ ఊహించలేదంటున్నారు.

కూటమి నేతల వ్యూహాలకు వైసీపీ నేతలు షాక్ అవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా, అరెస్టు అనే పదం వినేసరికి వణికిపోతున్నట్లు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయినా, తాజాగా అరెస్టు అయిన పోశాని క్రిష్ణమురళీ అయినా గతంలో మీడియా ముందు తమనేం చేయలేరిన తోడగొట్టేవారని అంతా గుర్తు చేస్తున్నారు.

అయితే ఈ ఇద్దరినీ అరెస్టు చేసే సమయంలో ఏవేవో సాకు చూపి తప్పించుకోవాలని చూడటంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక వంశీ అరెస్టు తర్వాత పోశాని అరెస్టు అవుతారని ఎవరూ ఊహించలేదు. వంశీ ఉంటున్న అపార్ట్మెంట్ లోనే పోశాని ప్లాట్ ఉంది. వంశీ అరెస్టు తర్వాత పోశాని కూడా ఎక్కడా స్పందించలేదు. తనపై సోషల్ మీడియా కేసులు నమోదైన తర్వాత ఆయన గుప్ చప్ అయిపోయారు. అయినా కూటమి నేతలు మాత్రం పోశానిని విడిచిపెట్టలేదు.

వంశీ తర్వాత నెక్ట్స్ మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని అంటూ చాలా పేర్లు చదివిన టీడీపీ నేతలు ఎక్కడా పోశాని పేరు ప్రస్తావించలేదు. ఇక డైరెక్టర్ ఆర్జీవీపై కేసులు, విచారణ సమయంలో కూడా పోశాని గురించి ఎవరికీ గుర్తులేదు. అయినా కూటమి నేతలు మాత్రం పోశానిని తేలిగ్గా విడిచిపెట్టలేదంటున్నారు. ప్రధానంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబాలపై మాట్లాడటం, వ్యక్తిగత దూషణలకు దిగడంతోనే పోలీసులు అరెస్టు నుంచి ఎవరూ తప్పించలేకపోయారంటున్నారు.

సాధారణ రాజకీయ విమర్శలు చేస్తే క్షమించవచ్చు కానీ, పోశాని పరిధి దాటి దుర్భాషలాడటంతో సినీ రంగం కూడా ఆయనను సపోర్టు చేయలేకపోతోంది. ఇదే సమయంలో పోశానితోపాటు గతంలో వైసీపీలో పనిచేసిన హాస్యనటుడు అలీని ఎవరూ ఏం అనకపోవడం చర్చకు తావిస్తోంది. వైసీపీలో పనిచేసినా, అలీ ఎక్కడా తప్పుడు మాటలు ఆడలేదన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక పోశానిపై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. ఫస్ట్ అన్నమయ్య జిల్లాలో అరెస్టు చూపినా, తర్వాత వరుసగా ఇతర జిల్లాల్లో నమోదైన కేసుల్లో అదుపులోకి తీసుకోవచ్చునని అంటున్నారు. దీంతో పోశాని ఎపిసోడ్ ఎటు దారితీస్తుందోనని ఉత్కంఠ కనిపిస్తోంది.

Tags:    

Similar News