పోసానికి అస్వస్థత.. జైలులో ఏం జరిగింది?

శుక్రవారం ఉదయం రాజంపేట జైలుకు పోలీసులు ఆయనను తరలించగా, శనివారం మధ్యాహ్నం పోసానికి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

Update: 2025-03-01 11:56 GMT

అన్నమయ్య జిల్లా రాజంపేట జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ నటుడు, వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళి అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం మందులు తీసుకుంటున్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుటుంబాలపై దూషణలకు దిగి రెండు వర్గాలు, కులాల మధ్య చిచ్చురేపేలా ప్రయత్నించారని పోసానిపై కేసులు నమోదు చేయడంతో అరెస్టు అయ్యారు. ఈ కేసులో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. శుక్రవారం ఉదయం రాజంపేట జైలుకు పోలీసులు ఆయనను తరలించగా, శనివారం మధ్యాహ్నం పోసానికి అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

శుక్రవారం రాజంపేట సబ్ జైలుకు తరలించే ముందు పోలీసులు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సమయంలోనే వైద్యులు ఆయనకు ఈసీజీ పరీక్ష నిర్వహించగా, కొద్దిపాటి సమస్యను వైద్యులు గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే మందులు వాడుతుండటం వల్ల ఆయనకు పెద్ద ఇబ్బంది ఏమీ లేదని జైలుకు తీసుకువెళ్లాలని సూచించారు. అయితే జైలులో 36 గంటలు పైగా ఉన్న పోసాని విపరీతమైన ఎండ, ఉక్కపోత తట్టుకోలేక అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. ఆయన శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తడంతో అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు.

జైలులో ఇబ్బంది పడుతున్న పోసానిని వెంటనే జైలు అధికారులు అస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ కు రిఫర్ చేశారు. ప్రస్తుతం పోసానికి కట్టుదిట్టమైన భద్రత నడుమ కడప రిమ్స్ లో వైద్యం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News