పాపం పోసాని, కోర్టు వరమిచ్చినా.. పోలీసులు కరుణించడం లేదా?
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ను దూషించిన కేసులో అరెస్టు అయిన పోసాని క్రిష్ణమురళి సుమారు నెల రోజులపాటు జైలు జీవితం గడిపారు.;

దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించడం లేదన్నది పాత సామెత.. కోర్టు వరమిచ్చినా, పోలీసులు కరుణించడం లేదు అంటూ ఆ పాత సామెతకు కొత్త భాష్యం చెప్పాల్సివస్తోందని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. సోషల్ మీడియా కేసుల్లో వైసీపీ నేతలపై వరుస కేసులు, కేసుల మీద కేసులు నమోదవుతుండటంతో కోర్టులు బెయిల్ ఇచ్చినా, వేరే కేసుల్లో మళ్లీ పోలీసు స్టేషన్లకు వెళ్లాల్సిరావడం వైసీపీలో చర్చనీయాంశమవుతోంది. తాజాగా సినీ నటుడు, వైసీపీ కీలక నేత పోసాని క్రిష్ణమురళి విషయంలో సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేయడం వైసీపీతోపాటు పోసానిని టెన్షన్ పెడుతోందంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ను దూషించిన కేసులో అరెస్టు అయిన పోసాని క్రిష్ణమురళి సుమారు నెల రోజులపాటు జైలు జీవితం గడిపారు. ముందుగా పోసానిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆ తర్వాత ఆయనపై సుమారు 17 కేసులు నమోదయ్యాయి. సీఐడీ కూడా ఓ కేసు నమోదు చేసింది. ఇలా ఒక్క సోషల్ మీడియా వ్యవహారంపైనే పోసానిని రిమాండులో ఉంచుతూ రాష్ట్రవ్యాప్తంగా జైలు మార్చి జైలుకు తిప్పడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ద్వారా బెయిల్ తెచ్చుకున్న పోసాని, ఆ తర్వాత సైలెంటుగా హైదరాబాద్ వెళ్లిపోయారు.
అయితే పోసానికి బెయిల్ వచ్చిన తర్వాత సుమారు 20 రోజులు ఆయన ఊసెత్తని పోలీసులు తాజాగా నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. కండిషన్ బెయిలుపై బయట ఉన్న పోసాని సీఐడీ పోలీసుస్టేషన్ లో సంతకం చేయడానికి సోమవారం గుంటూరు రాగా, అక్కడికి వచ్చిన సూళ్లూరుపేట పోలీసులు తమ పోలీసుస్టేషన్ లో నమోదైన కేసులో విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ప్రకారం ఆయన ఈ నెల 15న సూళ్లూరుపేట వెళ్లాల్సివుంటుంది.
అయితే ఇప్పటికే పోలీసు ట్రీట్మెంటు ఎలా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్న పోసాని సూళ్లూరుపేట పోలీసుస్టేషన్ కి వెళ్లడంపై తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే తనపై నమోదైన కేసుల్లో కొన్నింటికి బెయిలు, మరికొన్నింటికి అరెస్టు నుంచి రక్షణ పొందిన పోసాని, తాజా నోటీసులపై ఎలా అడగు వేయాలని తన న్యాయవాదులతో చర్చిస్తున్నారని చెబుతున్నారు. పోలీసులు జారీ చేసిన నోటీసులపై మళ్లీ కోర్టుకు వెళ్లాలా? లేక నోటీసుల ప్రకారం సూళ్లూరుపేట వెళ్లి విచారణకు సహకరించాలా? అన్నది తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. ఒకవేళ సూళ్లూరుపేట వెళ్లిన తర్వాత, ఇంకో పోలీసుస్టేషన్ నుంచి నోటీసులు జారీ అయితే ఏం చేయాలన్నది కూడా ఆయనలో అనుమానాలను రేకెత్తిస్తోందని అంటున్నారు. పోలీసుల నోటీసులు, అరెస్టుల బాధ లేకుండా శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంటుందా? అనేది కూడా పోసాని తన న్యాయవాదులతో చర్చిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ నెల 15న సూళ్లూరుపేట పోలీసుస్టేషన్ కు వెళ్లే విషయంలో పోసాని తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెబుతున్నారు.