పవన్ ప్రస్తావన తెచ్చేందుకు ధైర్యం చేయని పోసాని!
ఇప్పుడా జాబితాలోకి రచయత.. నటుడు పోసాని క్రిష్ణమురళి చేశారు
అదేంటో కానీ గడిచిన కొన్నేళ్లలో ఎప్పుడు లేని విధంగా ఏపీకి చెందిన ప్రముఖులు.. సెలబ్రిటీలు.. రాజకీయ విశ్లేషకులు.. గడిచిన ఐదేళ్లలో ముతక మాటలతో ఇష్టారాజ్యంగా విరుచుకుపడినోళ్లు.. బూతులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న వారంతా రాత్రికి రాత్రి జ్ఞానోదయం అవుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడా జాబితాలోకి రచయత.. నటుడు పోసాని క్రిష్ణమురళి చేశారు. ప్రెస్ మీట్ పెట్టి తన మాటల మారధాన్ లో తన రాజకీయ ప్రత్యర్థుల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేయటమే కాదు.. ఆయన మాటల్ని విన్న సదరు నేతల కుటుంబ సభ్యులు భోజనాలు కూడా చేయకుండా మానేసేంత ఎఫెక్టు ఆయన సొంతం.
అలాంటి ఆయనకు ఉన్నట్లుండి ఒక్కసారిగా తత్త్వం బోధ పడింది. రెండు చేతులు జోడించి.. తన జీవితంలో ఇంకెప్పుడు రాజకీయ విమర్శలు చేయనంటూ స్పష్టం చేశారు. సినిమాల్లో మాదిరి తన చెంపలు తాను వాయించుకోలేదు కానీ.. తాను విమర్శలు మాత్రమే చేశానే తప్పించి.. తప్పుడు తిట్లు తిట్టలేదన్నట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను తిట్టిపోసిన చంద్రబాబు.. లోకేశ్ లాంటి వారికి సంబంధించిన గుణగణాలను కీర్తించటమే కాదు.. తాను గతంలో వారి విషయంలో ఏమేం మంచి పనులు చేశారో చెప్పుకునే ప్రయత్నం ద్వారా.. చాలానే కష్టపడ్డారు.
తాను రాజకీయాల గురించి మాట్లాడుతున్న సమయంలో అందరినీ విమర్శిస్తుంటానని అనుకుంటారని.. తాను రాజకీయ పార్టీ నేతల నీతి.. నిజాయితీలు.. నడవడిక ఆధారంగా కామెంట్స్ చేస్తానే తప్పించి మంచినాయకుడిని విమర్శించలేదని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఏపీలో చంద్రబాబు.. జగన్.. రాజశేఖర్ రెడ్డి.. ఎన్టీఆర్ ఇలా అందరినీ వారి గుణగణాలను సపోర్టు చేశానని.. తప్పులు చేసిన ప్రతి ఒక్కరినీ విమర్శించినట్లుగా చెప్పుకొచ్చారు. తాను వైసీపీ కి సంబంధించిన ఎలాంటి సభ్యత్వం తీసుకోలేదన్న పోసాని.. ఏ పార్టీ సభ్యత్వాన్ని తాను తీసుకోలేదన్నారు.
అయితే..పోసాని తాజా క్లారిఫికేషన్ కు బాగానే పంచ్ లు పడుతున్నాయి. అందరి గుణగుణాల్ని చెప్పటమే నిజమైతే.. వైఎస్ జగన్ మీద ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా విమర్శ ఎందుకు చేయలేదు? అంటే.. ఐదేళ్ల జగన్ పాలనలో ఒక్క తప్పు జరగలేదన్న సర్టిఫికేట్ ను పోసాని ఇస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు.. లోకేశ్.. మోడీ.. వైఎస్.. ఇలాంటి ఎందరో ప్రముఖ నేతల పేర్లను ప్రస్తావించిన పోసాని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పేరును సైతం ప్రస్తావించేందుకు ఎందుకు సాహసించలేదో చెప్పాలంటున్నారు.
పవన్ మీద పోసాని చేసిన ఘాటు విమర్శలు.. వ్యాఖ్యలు.. ఆయన వ్యక్తిత్వాన్ని దారుణంగా దెబ్బ తీసేలా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి వివరణ ఇస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ పవన్ తప్పు చేసి ఉంటే.. దాని ఆధారాలు చూపించాలి కదా? అదేమీ చేయకుండా ఇష్టారాజ్యంగా మాటలు అనేసిన పోసాని.. గతంలో తాను వ్యవహరించిన తీరుకు ఎలాంటి జస్టిఫికేషన్ ఇస్తారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. జనసేనాని విషయంలో ఆయన మాట్లాడిన మాటల మీద వివరణ ఇచ్చే వరకు వదలకూడదన్న ఆగ్రహం జనసైనికులు ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి తప్పు చేయకున్నా.. కేవలం రాజకీయ కక్షతో నోరు పారేసుకున్న పోసాని.. ఎంత వేడుకున్నా ఆయన చేసిన తప్పులకు మూల్యం చెల్లించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.