జోగి రమేశ్ కు ఫ్లెక్సీ షాక్.. టికెట్ వద్దు జగనన్నా అంటూ రిక్వెస్టు!
అంతేకాదు.. జోగి రమేశ్ ను తమ నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించటం సరికాదంటూ ఆయనపై తమకున్న వ్యతిరేకతను ఫ్లెక్సీలో స్పష్టంగా పేర్కొన్నారు.
త్వరలో జరిగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా మారింది. ఎమ్మెల్యే టికెట్లకు సంబంధించి.. సదరు నియోజకవర్గంలో ఇంఛార్జిగా ప్రకటించటం ద్వారా.. వారికే పార్టీ టికెట్ ఇస్తున్న వైఎస్ జగన్.. తాజాగా పలువురిని ఎంపిక చేయటం తెలిసిందే. క్రిష్ణా జిల్లా పెనమలూరు వైసీపీ ఇంఛార్జిగా జోగి రమేశ్ ను నియమిస్తూ తీసుకున్న నిర్ణయంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మొన్నటివరకు పార్టీ నేతల్లో అదే పనిగా చర్చ నడుస్తుంటే.. తాజాగా కంకిపాడు బస్టాండ్ వద్ద భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన వైనం షాకిచ్చేలా మారింది. అందులో పెనుమలూరు అసెంబ్లీ టికెట్ ను జోగి రమేశ్ కు కేటాయించొద్దని జగనన్నను రిక్వెస్టు చేయటమే కాదు.. పనిలో పనిగా లోకల్ ఎమోషన్ ను బయటకు లాగారు. అంతేకాదు.. జోగి రమేశ్ ను తమ నియోజకవర్గానికి ఇంఛార్జిగా నియమించటం సరికాదంటూ ఆయనపై తమకున్న వ్యతిరేకతను ఫ్లెక్సీలో స్పష్టంగా పేర్కొన్నారు.
జోగి రమేశ్ ను పెనమలూరు ఇన్ ఛార్జిగా నియమించటం సరైన నిర్ణయం కాదు.. ఇక్కడ ఎలాంటి పరిచయాలు లేని వ్యక్తిని ఎలా కేటాయిస్తారు? అధిష్ఠానం పునరాలోచించాలి.. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు నేపథ్యంలో జిల్లాకు ఒక్క మహిళకైనా సీటు కేటాయించాలని జగనన్నా అంటూ ముక్తాయించారు. ఇదిలా ఉంటే.. జోగి రమేశ్ అభ్యర్థిత్వాన్ని కంకిపాడుకు చెందిన పడమట సురేష్ బాబు.. కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ లు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో.. మహిళకు టికెట్ ఇవ్వాలని కోరిన వైనం ఒక ఎత్తు అయితే.. ఫ్లెక్సీ రిక్వెస్టుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ ఏ తీరులో రియాక్టు అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.