కమలం దిశగా.. 'పోతిన' అడుగులు.. !
దీంతో ఆయన జనసేన నుంచి బయటకు వచ్చి.. వైసీపీకి జై కొట్టారు. అయితే.. అప్పటికే వైసీపీలోనూ.. టికెట్ కేటాయింపులు పూర్తయ్యాయి.
విజయవాడ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయా? కీలక నాయకులు బీజేపీ వైపు చూస్తు న్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్.. త్వరలోనే బీజేపీ గూటికి చేరడం ఖాయంగా మారిందని ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించిన మాజీ జనసేన నాయకుడు పోతిన మహేష్‌కు టికెట్ దక్కలేదు.
దీంతో ఆయన జనసేన నుంచి బయటకు వచ్చి.. వైసీపీకి జై కొట్టారు. అయితే.. అప్పటికే వైసీపీలోనూ.. టికెట్ కేటాయింపులు పూర్తయ్యాయి. దీంతో ప్రచారానికి మాత్రమే పోతిన పరిమితమయ్యారు. అయితే.. ఇక్కడ కూడా వైసీపీ పరాజయం పాలైంది. ఆ తర్వాత.. పార్టీ తరఫున మీడియా ముందుకు వచ్చినా.. పెద్దగా గుర్తింపు అయితే లభించలేదు. ఇక, పార్టీలోనూ పోతిన మాట వినిపించడం లేదు.
దీంతో పోతిన మహేష్ కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయనకు గే లం వేస్తున్నట్టు గత నెలలోనే సమాచారం వెలుగు చూసింది. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇక్కడ తన ప్రభావాన్ని పెంచుకునే క్రమంలో స్థానికంగా బలంగా ఉన్న పోతిన వంటివారిని దరి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ మారడం ద్వారా రాజకీయ పరంగా ఎలా ఉన్నా.. ఆర్థికంగా అయితే.. వెసులు బాటు లభించే అవకాశం ఉంటుంది.
ఈ విషయమే పోతినను బీజేపీవైపు మొగ్గు చూపేలా చేస్తోందని అంటున్నారు పరిశీలకులు. వైసీపీలో ఉన్నా.. వచ్చే నాలుగేళ్లు పోరాటాలు, ఆరాటాలు తప్ప చేయాల్సింది ఏమీలేదు. ఇప్పటికే గత ఐదేళ్లు పోరాడి.. ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పోతిన.. ఇప్పుడు ఇంకా పోరాటం చేసేందుకు సన్నద్ధంగా అయితే లేరు. అందుకే.. ఆయన రూటు మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.