ప్రేమోన్మాదమా... కామోన్మాదమా ?

విశాఖలో జరిగిన ఒక ఘాతుకలో ఉన్మాది ఇలాగే చేశాడు. ఆ అమ్మాయిని తల్లిని కూడా కత్తి వేటుకు బలి చేశాడు. స్పాట్ లో తల్లి చనిపోయింది.;

Update: 2025-04-02 17:19 GMT
ప్రేమోన్మాదమా... కామోన్మాదమా ?

ప్రేమ అతి పవిత్రమైనది. అది ఎదుటి వారి చావుని కోరదు. తనను తాను త్యాగం చేసుకుంటుంది. ప్రేమ అంటేనే దైవ సమానం. అతి పవిత్రం. అతి దయామయం. దేవుడుకి పర్యాయపదంగా కూడా ప్రేమను వాడవచ్చు. చిత్రమేంటి అంటే ఆ ప్రేమ కేవలం మనుషులలోనే కాదు సమస్త జంతు జాలంలోనూ ఉంది.

ఆ జంతువులు నేటికీ అదే ప్రేమను కొనసాగిస్తున్నాయి. మనిషి మాత్రం తనలోని ప్రేమను చంపేసుకుని ఎదుటి వారిని చంపేస్తున్నాడు. ఇక ఈ తరం గురించి చెప్పుకోవాలీ అంటే అక్షరాలు చాలవు. ఏమి కూడా రాయడానికి సైతం మెదడు మొద్దుబారుతుంది.

ప్రేమ అన్న అందమైన భావనను ముసుగుగా వేసుకుంటూ తిరిగే గాలి బ్యాచ్ అంతా ప్రేమికులే. తమతో అమ్మాయి తిరిగితే ప్రేమ. తిరగకపోతే అది పాపం. అమ్మాయి మాట వింటే ఆనందం. కాదని అంటే ఆమెకే చూపిస్తాడు నరకం.

విచిత్రంగా ఇలాంటి వారిని పట్టుకుని ప్రేమోన్మాదులు అని మీడియా రాతలు రాస్తోంది. కర్కశంగా కత్తి పోట్లు పొడిచి చంపేస్తున్న వారిని ప్రేమోన్మాదులు అనడం సబబేనా. అమ్మాయి తన వెంట తిరిగితే ప్రేమ అనుకుంటాడు. ఆ మీదట పెళ్ళి కావాలంటాడు. తన అభిప్రాయాలు ఆమె మీద రుద్దడమే కానీ ఆమె మనసులో ఏముందో అవసరం లేదు

ఇదంతా చూతే ప్రేమ కాదు పాడూ కాదు సైకో అనాల్సిన అవసరం ఉంది కదా. ఇలాంటి సైకో మెంటాలిటీతో ఆమె పక్కన తిరుగుతూ మేక వన్నె పులిగా వ్యవహరిస్తూ ఆమె కాదు అన్న క్షణాన తనలోకి కర్క సుడిని బయటకు తీసి మరీ కసా కసా కసి తీరా కత్తి పోట్లు పొడిచే వాడిని ప్రేమోన్మాది అంటారా లేక కామోన్మాది అంటారా.

విశాఖలో జరిగిన ఒక ఘాతుకలో ఉన్మాది ఇలాగే చేశాడు. ఆ అమ్మాయిని తల్లిని కూడా కత్తి వేటుకు బలి చేశాడు. స్పాట్ లో తల్లి చనిపోయింది. కత్తివేటుకు చిక్కిన లేడి కూనలా చావుబతుకుల మధ్యన కొట్టుకుంటోంది ఆ అమ్మాయి. ఇంతా చేసిన ఆ కామోన్మాది ఏమీ ఎరగనట్లుగా పరారి అయ్యాడు.

పోలీసులు అతన్ని చేదించి పట్టుకున్నారు కానీ అమ్మాయి ప్రాణాలకు మాత్రం భరోసా దక్కేలా లేదు. గజానికో గాంధారీ పుత్రుడు అని కొన్ని దశాబ్దాల క్రితం బాల గంగాధర తిలక్ అనే మహాకవి రాశారు. ఇపుడు దానిని మార్చి రాస్తే ప్రతీ సెకన్ కి ఒక కామాంధుడు అని అనుకోవాలేమో.

కామంతో కన్నూ మిన్నూ కానకుండా వయసు తెచ్చిన తెంపరితనంతో రెచ్చిపోయి తాను హంతకుడై తన వారిని చింతల లోకి నెట్టి ఎదుటి వారిని ఏకంగా పాడెక్కించే వారి తరమే జర జరా సాగుతూ పోతోంది. దీనికి ఎవరిని నిందించాలి అంటే అటూ ఇటూ తిప్పి సమాజాన్నే అనాల్సిందే. ఎందుకంటే ఎవరిని ఎలా పెంచాలో తెలియక అయోమయంతో గుడ్డిగా సాగుతున్న ఈ సమాజంలో గంజాయి విత్తనాలే మొలకెత్తుతాయి, గాంధారీ పుత్రులే గజ్జె కట్టి మరీ నర్తిస్తారు. ఉల్లి వేసిన తోటలో మల్లె పూవు పూయమంటే పూస్తూందా.

నేరాలు ఎక్కువ అయ్యాయని పాలక పక్షాన్ని ప్రతిపక్షం ప్రతిపక్షాన్ని పాలక పక్షం ఆడిపోసుకోవడం కాదు. ఎందుకంటే వారెవరూ పూర్తి స్థాయి బాధ్యులు కానే కారు. టోటల్ గా సొసైటీయే బాధ్యురాలు. అందువల్ల ఈ సమాజాన్ని ఎత్తి కుదేసి మళ్ళీ అరటి చెట్ల బడిలో వేసి ఉగ్గు పాలు పట్టి నీతి శతకాలతో నిత్య స్నానాలు చేయించిన నాడే బాగుపడుతుందేమో. అంతవరకూ ఈ రియల్ క్రైమ్ స్టోరీస్ వింటూ కంటూ కృత్రిమమైన భావోద్వేగాలు తెచ్చుకుంటూ బతుకులు ఇలా ఈడ్వాల్సిందేనేమో.

Tags:    

Similar News