పవర్ ఫుల్ పాస్ పోర్ట్ లలో భారత్ స్థానం తెలుసా?
ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్ పోర్ట్ లు... ఈ చర్చ ప్రతీ ఏటా తెరపైకి వస్తుంటుంది.
ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్ పోర్ట్ లు... ఈ చర్చ ప్రతీ ఏటా తెరపైకి వస్తుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ.. ప్రపంచంలోనే పవర్ ఫుల్ పాస్ పోర్ట్ కలిగిన దేశాల జాబితాను విడుదల చేసింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ లిస్ట్ రూపొందించినట్లు వెల్లడించింది.
అవును... వరల్డ్ వైడ్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ లిస్ట్ ను తాజాగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ సంస్థ విడుదల చేసింది. ఈ సందర్భంగా... భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా... గతంతో పోలిస్తే మూడు స్థానాలు మెరుగుపర్చుకున్న భారత్... ఈ పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ తాజా జాబితాలో 82వ స్థానంలో నిలిచింది. కాగా... ఈ ఏడాది ఫిబ్రవరిలో 85వ స్థానంలో ఉండేది!
ప్రస్తుతం మన పాస్ పోర్ట్ తో మలేషియా, థాయ్ లాండ్, ఇండోనేషియా వంటి 58 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయొచ్చు. వాస్తవానికి గతంలో ఈ లిస్ట్ లో 59 దేశాలు ఉండగా.. ఇప్పుడు ఒకటి తగ్గింది. ఇక మన పక్కనున్న పాకిస్థాన్ ఈ జాబితాలో 100 స్థానంలో ఉండగా.. ఆ దేశ పాస్ పోర్ట్ తో 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.
ఇక వరల్డ్ లోనే పవర్ ఫుల్ పాస్ పోర్ట్ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పవర్ ఫుల్ పాస్ పోర్ట్ తో 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చని హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ వెల్లడించింది! ఇక సింగపూర్ తర్వాత రెండో స్థానంలో... జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ దేశాల పాస్ పోర్టులు ఉన్నాయి.
ఈ దేశాల పాస్ పోర్ట్ లతో 192 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం చేయవచ్చు. ఇక మోస్ట్ పవర్ ఫుల్ పాస్ పోర్ట్స్ జాబితాలో మూడో స్థానంలో... నెదర్లాండ్స్, స్వీడన్, ఆస్ట్రియా, ఫిన్ లాండ్, ఐర్లాండ్, సౌత్ కొరియా, లగ్జెంబర్గ్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్ట్ తో వీసా లేకుండా 191 దేశాలకు వెళ్లవచ్చు.
ఇక ఈ జాబితాలో 8వ స్థానం దక్కించుకుంది అగ్రరాజ్యం అమెరికా. ఈ దేశం పాస్ పోర్ట్ ఉన్నవారు ప్రపంచలోని 186 దేశాలకు వీసా లేకుండా వెళ్లిరావొచ్చు. ఇక ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది ఆఫ్గానిస్తాన్. 103వ ర్యాంక్ లో ఉన్న ఈ దేశ పాస్ పోర్ట్ కలిగినవారు 26 దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చెయవచ్చు అని హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్, తన తాజా నివేదికలో వెల్లడించింది.