ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. అమెరికాకు ప్రభాకర్‌రావు మరో అప్పీల్
ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావుకు ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైంది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. గత బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు చేసిన ఈ ప్రయత్నం బెడిసికొట్టింది. దాంతో ఒక్కొక్కరుగా ఊచలు లెక్కబెడుతున్నారు. అయితే.. ఈ కేసులో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు మాత్రం అమెరికాలో తలదాచుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావుకు ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైంది. ప్రభాకర్ రావు అమెరికాలోనే స్థిరపడిన కుటుంబసభ్యుల స్పాన్సర్‌షిప్‌తో ఆయన తాజాగా గ్రీన్‌కార్డు పొందగలిగారు. గ్రీన్‌కార్డు ద్వారా ఇక ప్రభాకర్‌రావు ఎన్ని ఏళ్లయినా అమెరికాలోనే ఉండే వెసులుబాటు దొరికింది. ఇక దాంతో అతడిని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అప్పటి నుంచి పోలీసులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీనికితోడు ఇప్పటికే ప్రభాకర్‌రావు పాస్‌పోర్టు రద్దు అయింది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఈ ఏడాది మార్చి 10న ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అంతకుముందే ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో ఆరోపణలు చేశారు. తన ఫోన్‌తోపాటు తన ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ గెలిచి అధికారం చేపట్టడంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో ఎస్ఐబీ అదనపు ఎస్పీ రమేశ్ ఫిర్యాదుతో ట్యాపింగు ఆరోపణలకు మరింత బలం చేకూరింది.
మార్చి 10న పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మార్చి 11న ప్రభాకర్‌రావు ఇండియా వదిలి అమెరికా వెళ్లిపోయారు. ఇక అప్పటి నుంచి అక్కడే ఉండిపోయారు. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ప్రభాకర్‌రావును ప్రధాన నిందితుడిగా చేరుస్తూ కోర్టులో చార్జిషీట్ ఫైల్ చేశారు. అప్పటి నుంచి అమెరికా నుంచి ప్రభాకర్‌రావును రప్పించే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఆయనకు మెయిల్ ద్వారా పోలీసులు నోటీసులు సైతం పంపించారు. తాను వైద్య చికిత్స నిమిత్తం అమెరికా వెళ్లినట్లు రిప్లై ఇచ్చారు. జూన్‌తో తన వీసా గడువు ముగుస్తుందని, ఈ లోపు వైద్యులు అనుమతిస్తే హైదరాబాద్ వస్తానని చెప్పారు.
అయితే.. ముగిసినప్పటికీ ప్రభాకర్‌రావు ఇండియా రాలేదు. గడువు ముగిసే క్రమంలో మరో ఆరు నెలలకు పొడగించుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో వెంటనే పోలీసులు ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఆ వెంటనే ఆయన పాస్‌పోర్టును రద్దు చేశారు. ఇదే విషయాన్ని అమెరికా విదేశాంగకు చేరవేసే ప్రయత్నం చేస్తుండగానే.. ఆయనకు గ్రీన్‌కార్డు మంజూరైనట్లు సమాచారం వచ్చింది.
ఇప్పటికీ ఇండియాకు రాకుండా దోబూచులాడుతున్న ప్రభాకర్‌రావు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలని యూఎస్ ప్రభుత్వాన్ని కోరారు. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తెలంగాణ ప్రభుత్వం తనను ఇబ్బంది పెడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఫ్లోరిడాలో కుమారుడి వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రభాకర్‌రావును స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.