''జనాలు అడుక్కోవడానికి అలవాటు పడ్డారు''
అక్కడితో కూడా ఆగకుండా.. ఇలా అడుక్కునేం దుకు అలవాటు పడిన వారిపైక్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు.;
దేశంలోని ప్రజలు అడుక్కోవడానికి అలవాటు పడ్డారంటూ... కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత మధ్యప్రదేశ్ పంచాయతీ, గ్రామాణభి వృద్ధి శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ సింగ్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ``ఇచ్చింది తీసుకోరు. ఇంకాకావాలి.. ఇంకా కావాలని దురాశకు పోతారు. ప్రభుత్వం నుంచి ప్రతీదీ అడుక్కోవడానికి అలవాటుపడుతున్నారు`` అని ఆయన వ్యాఖ్యానించా రు. అంతేకాదు.. ఇలా అడుక్కునే లక్షణం మానుకోవాలని గీతోపదేశం చేశారు. అక్కడితో కూడా ఆగకుండా.. ఇలా అడుక్కునేం దుకు అలవాటు పడిన వారిపైక్రిమినల్ చర్యలు తీసుకునేలా చట్టం తేవాల్సిన అవసరం ఉందన్నారు.
హామీలు అమలు చేయమన్నందుకు..
గత ఏడాది జరిగిన మధ్య ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం దక్కించుకుంది. ఈ క్రమంలో బీజేపీ నాయకులు పలు హామీలు గుప్పించారు. అయితే.. కొన్నింటిని అమలు చేసినా.. చాలా వరకు పెండింగులో ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి ప్రహ్లాద్ సింగ్.. రత్నగిరి జిల్లా సుథలియా టౌన్‌లో పర్యటించారు. ఈ నేపథ్యంలో స్థానిక విపక్ష నాయకులతో కలిసి ప్రజలు ఆయనను ఎన్నికల హామీలపై ప్రశ్నించారు. అదేవిధంగా రహదారుల దుస్థితిని కూడా ప్రశ్నించారు. తమకు ఇస్తామన్న ఉచిత గ్యాస్ ఎప్పటి నుంచి ఇస్తారని, రోడ్లను ఎప్పుడు బాగు చేస్తారని మహిళలు నిలదీశారు. అప్పుడు మౌనంగా వెళ్లిపోయిన మంత్రి.. తర్వాత.. నిప్పులు చెరిగారు.
అనంతరం.. రాణి అవంతి బాయ్ లోథి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు అడుక్కోవడం అలవాటైపోయిందన్నారు. కష్టపడి సంపాయించుకుంటే.. ప్రభుత్వాల నుంచి అడుక్కోవడం తగ్గుతుందన్నారు. అంతేకాదు.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధునుల నుంచి వీరు పాఠాలు నేర్చుకోవాలని అన్నారు. ప్రజలకు తీసుకోవడమే తెలుస్తోందని.. ఇవ్వడం చేతకావడం లేదని విమర్శలు గుప్పించారు. ఇవ్వడం అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ``అడుక్కోవడం కాదు.. ఇవ్వడం నేర్చుకోండి`` అని సూత్రీకరించారు.
అయితే.. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన మధ్య ప్రదేశ్ ప్రభుత్వం మంత్రి వ్యాఖ్యలు వ్యక్తిగత మని.. అవి బీజేపీకి, ప్రభుత్వానికి సంబంధించినవి కావని వివరణ ఇచ్చింది. అంతేకాదు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చేందుకు తాము కృత నిశ్చయంతో ఉన్నామని స్పష్టం చేసింది. అయితే.. ఆర్థిక సమస్యల కారణంగా కొన్ని హామీలు ఆలస్యం అవుతున్నాయని వివరించింది.