రూ.81 లక్షల జీతం.. కక్కుర్తి పడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు!

ఏడాదికి రూ.81 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని అతడు తన కక్కుర్తితో పోగొట్టుకున్నాడు.

Update: 2024-04-25 07:09 GMT

ఒక వ్యక్తి కక్కుర్తి ఎంత పని చేసిందంటే చివరకు తన మంచి ఉద్యోగాన్ని పోగొట్టుకునేలా చేసింది. పోనీ అదేమైనా చిన్న ఉద్యోగం అంటే అదీ కాదు. ఏడాదికి రూ.81 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని అతడు తన కక్కుర్తితో పోగొట్టుకున్నాడు.

మెహుల్‌ ప్రజాపతి అనే వ్యక్తి కెనడాలోని టీడీ బ్యాంక్‌ లో డేటా సైంటిస్ట్‌ గా ఉద్యోగం చేస్తున్నాడు. జీతం ఏడాదికి రూ.81 లక్షలు. అలాగే అతడికి ఒక యూట్యూబ్‌ చానల్‌ ఉంది. అందులో కెనడాలో జీవన విధానం తదితరాల గురించి అతడు వివరిస్తుంటాడు. ఈ క్రమంలో అతడు కొన్ని వీడియోలు తీశాడు. ఇందులో తాను ఎలా డబ్బుల్ని ఆదా చేశాడో వివరించాడు. ఇవే ఇప్పుడు అతడి కొంపముంచాయి. అతడి ఉద్యోగానికి ఊస్టింగ్‌ పెట్టాయి.

ఇంతకూ మెహుల్‌ ప్రజాపతి తీసిన వీడియోలు ఏమిటంటే.. కెనడాలో నిరుపేద విద్యార్థులకు ఉచిత ఫుడ్‌ బ్యాంకులు ఉంటాయి. వాటిలో నిరుపేద విద్యార్థులకు ఆహారం, పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు, పాలు, కేకులు తదితర ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచుతారు. కెనడాలో జీవన వ్యయం ఎక్కువ. వీటిని డబ్బులు వెచ్చించి కొనుగోలు చేయలేని నిరుపేద విద్యార్థులు ఉచిత ఫుడ్‌ బ్యాంకుల్లో ఆహారం తీసుకోవచ్చు.

అయితే ఏడాదికి రూ.81 లక్షలు జీతం అందుకుంటున్న మెహుల్‌ ప్రజాపతి కూడా ఈ ఉచిత ఫుడ్‌ బ్యాంకుల్లో ఆహారం తీసుకుంటున్నానని.. తద్వారా తాను డబ్బులు ఆదా చేయగలిగానంటూ వీడియోలు తీశాడు. ప్రతి నెలా తాను ఇలాగే చేస్తున్నానంటూ వెల్లడించాడు.

అలాగే మరో వీడియోలో తాను వారానికి సరిపడ భోజనాన్ని ఉచితంగా తెచ్చుకున్నానని వివరించాడు. వాటిల్లో పండ్లు, కూరగాయలు, బ్రెడ్, సాస్‌లు, పాస్తా, క్యాన్డ్‌ వెజిటేబుల్స్‌ ఉన్నాయని ఆ వీడియోలో అందరికీ చూపించాడు. ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఏడాదికి రూ.81 లక్షలు జీతం పొందుతూ ఇదేం పాడుబుద్ధి అని అతడిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

నెటిజన్ల విమర్శలు మెహుల్‌ ప్రజాపతి పనిచేస్తున్న బ్యాంక్‌ వరకు చేరాయి. దీంతో అతడి పనిపై కన్నెర్ర చేసిన బ్యాంకు అతడిని విధుల నుంచి తొలగించింది.

Tags:    

Similar News