అత్యాచారాల్లో మాజీ ప్రధాని మనవడి దారుణాలు ఎన్నో!

దేవగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ సెక్సు వీడియోల వ్యవహారంలో జైలుపాలైన సంగతి తెలిసిందే.

Update: 2024-09-16 07:51 GMT

దేవగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ మహిళపై అత్యాచార వ్యవహారంలో జైలుపాలైన సంగతి తెలిసిందే. తనను సహాయం కోసం ఆశ్రయించిన మహిళపై పలుమార్లు అత్యాచారాలు చేశాడని.. వాటిని వీడియోలు తీసుకున్నాడని ఆయనపై కేసులు దాఖలయ్యాయి.

సొంత బంధువు అయిన మహిళను కూడా వదలకుండా ప్రజ్వల్‌ రేవణ్ణ తన కామ వాంఛను తీర్చుకున్నాడనే విషయం బయటపడింది. స్వయంగా అతడి చేతిలో అత్యాచారానికి గురయిన బంధువే ప్రజ్వల్‌ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒక్కొక్కరుగా బయటకొచ్చి అతడి అకృత్యాలను వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణను పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా ప్రజ్వల్‌ రేవణ్ణకు సహకారం అందించినందుకు అతడి తల్లి, దేవగౌడ పెద్ద కోడలు భవానీని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

కాగా ప్రజ్వల్‌ రేవణ్ణ అత్యాచారాలకు సంబంధించి దారుణ విషయాలు తాజాగా వెల్లడయ్యాయి. ఈ మేరకు అతడిపై పోలీసులు మూడో చార్జిషీట్‌ ను దాఖలు చేశారు. అత్యాచారానికి పాల్పడుతున్నప్పుడు బాధితురాలికి తనకు నచ్చిన లో దుస్తులను ఇచ్చి.. వాటిని ధరించాలని బలవంతపెట్టేవాడని.. ఆమెను నవ్వమని బెదిరించేవాడని చార్జిషీట్‌ లో పేర్కొన్నారు.

ప్రజ్వల్‌ రేవణ్ణ అత్యాచారాలకు సంబంధించి కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం సిట్‌ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) 1,691 పేజీల ఛార్జ్‌ షీట్‌ను ఎమ్మెల్యేలు/ఎంపీల ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. అంతేకాకుండా బాధితురాలి వాంగ్మూలాన్ని దానికి జత చేసింది.

ప్రజ్వల్‌ తనను తుపాకీతో బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు వాపోయింది. అత్యాచారం చేసేటప్పుడు తన న్యూడ్‌ వీడియోలను తీశాడని పోలీసులకు వెల్లడించినట్టు తెలుస్తోంది.

ప్రజ్వల్‌ రేవణ్ణ అత్యాచారం చేసేటప్పుడు ఏడవవద్దని.. నవ్వాలని బలవంతం చేయడంతోపాటు బెదిరించేవాడని బాధితురాలు పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.

ఇలా 2020 నుంచి 2023 వరకు మూడేళ్లపాటు బాధితురాలిపై ప్రజ్వల్‌ పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులు చార్జిషీట్‌ లో పేర్కొన్నారు. ఆమెను తన హోలెనరసిపురలోని నివాసానికి పిలిచి అత్యాచారం చేశాడని తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన ప్రతిసారీ ఆమె వీడియోలు తీసేవాడని.. ఎవరికైనా చెబితే ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించేవాడని చార్జిషీట్‌ లో పేర్కొన్నారు.

అలాగే ప్రజ్వల్, బాధితురాలు పాల్గొన్న ఓ కార్యక్రమానికి తాను హాజరయ్యానని ఈ కేసులో సాక్షిగా ఉన్న ఓ ఎమ్మెల్యే సిట్‌ తెలియజేశారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రజ్వల్‌ ఆమెకు పలుమార్లు ఫోన్‌ చేసి గెస్ట్‌ హౌస్‌ కు రమ్మని బలవంతం చేశారని ఆ ఎమ్మెల్యే తెలిపారు.

120 మందికి పైగా సాక్షులను విచారించిన సిట్‌ బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసింది.

ఈ నేపథ్యంలో సిట్‌.. ప్రజ్వల్‌పై సెక్షన్‌లు 376 (2) ఎన్‌ (ఒకే మహిళపై పదేపదే అత్యాచారానికి పాల్పడడం), 506 (నేరపూరిత బెదిరింపు), 354 (ఎ) (1) (అనుచితంగా ప్రవర్తించడం, అసభ్యకరమైన లైంగిక ప్రవర్తన, లైంగిక కోరికలను వ్యక్తం చేయడం), 354 కింద కేసు నమోదు చేసింది. అలాగే (మహిళపై నేరపూరితంగా ప్రవర్తించడం), 354 (సి) (వోయూరిజం, ఆమె అనుమతి లేకుండా ఆమె ఫొటోలు, వీడియోలు తీయడం) వంటి కేసులను నమోదు చేసింది.

కాగా ప్రజ్వల్‌ బెయిల్‌ పిటిషన్‌ ను కర్ణాటక హైకోర్టు సెప్టెంబర్‌ 19న విచారించనుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News