ప్రకాశం బ్యారేజ్ ను ఢీ కొన్న పడవల ఎపిసోడ్ లో కొత్త సీన్
భారీ వరదల వేళ కొట్టుకొచ్చిన నాలుగు భారీ పడవలు ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీ కొన్న వైనం తెలిసిందే.
భారీ వరదల వేళ కొట్టుకొచ్చిన నాలుగు భారీ పడవలు ప్రకాశం బ్యారేజీ కౌంటర్ వెయిట్లను ఢీ కొన్న వైనం తెలిసిందే. టన్నుల చొప్పున బరువున్న ఈ పడవల్ని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు వర్కువుట్ కాలేదు. మొత్తం నాలుగు పడవలు.. నీటి లోపల ఇసుకలో కూరుకుపోయాయి. ఇందులో ఒకటి బయటకు వస్తే.. మిగిలినవి బయటకు లాగొచ్చన్న ఉద్దేశంతో షురూ చేసిన ఆపరేషన్ తాజాగా ఒక కొలిక్కి వచ్చింది.
అయితే.. ఈ ఘటన చోటు చేసుకున్న నాటి నుంచి.. జరుగుతున్న ప్రయత్నాల్ని చూస్తున్న వారంతా నీటిలో మునిగిన భారీ పడవల్ని బయటకు తీయటం అంత కష్టమైన పనా? అన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చిన పరిస్థితి. అయితే.. మునిగిన పడవల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం ఎంత కష్టమైనది..క్లిష్టమైనది.. సాంకేతికంగా ఉన్న సవాళ్లు.. తొందరపాటుతో ఏర్పడే ఇబ్బందులు లాంటి వాటి గురించి ప్రజల్లో అవగాహన కలిగించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం వెనుకబడింది. పని చేస్తే సరిపోదు. ఆ పని గురించి ప్రజలకు తెలిచేలా ప్రచారం చేయాలన్న విషయాన్ని మర్చిపోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి.
ఇప్పటివరకు నీటి లోపల ఇసుకలో కూరుకుపోయిన బోట్లను బయటకు తీసేందుకు మూడు ప్రయత్నాలు చేయగా.. ఈ మూడు ఫెయిల్ అయ్యాయి. నాలుగో ప్లాన్ వర్కువుట్ అయ్యింది. బేకమ్ సంస్థ ఆధ్వర్యంలో జలవనరుల శాఖ ఇంజినీర్లు..కాకినాడ.. విశాఖ నుంచి వచ్చిన టీంలు చేస్తున్న ప్రయత్నాలు కొంతమేర ఫలిస్తున్నాయి. ఇందులో నీటి లోపల ఇసుకలో కూరుకున్న ఒక బోటును కాస్త బయటకు లాగారు. సోమవారం రాత్రి 9 గంటల వేళలో ఈ బోటు కాస్త బయటకు వచ్చింది. దీంతో.. నాలుగో ప్లాన్ వర్కువుట్ అయ్యే అవకాశం ఉందన్న ఆశావాహ పరిస్థితి చోటు చేసుకుంది.
నీటి లోపల కూరుకున్న బోట్లను బయటకు తెచ్చేందుకు.. మొదటి మూడు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతకూ ఆ మూడు ప్రయత్నాల్ని చూస్తే..
1. క్లెయిన్ల ద్వారా లాగటం.
2. గ్యాస్ కట్టర్లతో ముక్కులు చేసి.. విడి భాగాల్ని తీసుకురావటం
3. బరువైన బోట్లతో నీటిలోనే లాక్కొచ్చే ప్రయత్నం
ఈ మూడు ప్లాన్లు వర్కువుట్ కాకపోవటంతో నాలుగో ప్లాన్ ను తెర మీదకు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా భారీ సామర్థ్యం ఉన్న రెండు బోట్లను తీసుకొచ్చి.. గడ్డర్లతో వాటికి లంకె పెట్టి నీటితో నింపారు. దీంతో.. అవి కొంతమేర నీట మునిగాయి. వాటికీ.. ఇసుకలో కూరుకున్న బోటుకు మధ్య భారీ ఇనుపగొలుసులతో లంకె వేశారు.
ఆపై ఈ బోట్లలోని నీటిని బయటకు తోడేయటంతో అవి క్రమంగా పై భాగానికి తేలుతున్నాయి. వాటితో పాటు ఇసుకలో చిక్కుకున్న బోటును కొంత మేర బయటకు లాగగలిగారు. ఈ బోట్లలోని నీటిని బయటకు తోడేయటం ద్వారా కొంత మేరబయటకు వచ్చాయి. వీటిని పూర్తిగా బయటకు తెచ్చి.. గొల్లపూడి వైపు లాక్కళ్లేందుకు సోమవారం రాత్రి మొత్తం పని చేశారు. నాలుగో ప్రయత్నం వర్కువుట్ అవుతుందని.. ఇంతకాలం ప్రయత్నిస్తున్న వారి కష్టం ఫలించటం ఖాయమన్న ధీమా వ్యక్తమవుతోంది.