Begin typing your search above and press return to search.

ప్రకాశం బ్యారేజి గేట్ల ధ్వంసానికి కుట్రలో కొత్త కోణాలు!

ఓవుపు ముంపుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడకు కొత్తకష్టం తెచ్చే ఒక కుట్ర జరిగిందా? అదే జరిగితే.. పరిస్థితి ఎలా ఉండేదన్న అంచనానే వణికేలా చేస్తోంది

By:  Tupaki Desk   |   9 Sep 2024 4:31 AM GMT
ప్రకాశం బ్యారేజి గేట్ల ధ్వంసానికి కుట్రలో కొత్త కోణాలు!
X

ఓవుపు ముంపుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న విజయవాడకు కొత్తకష్టం తెచ్చే ఒక కుట్ర జరిగిందా? అదే జరిగితే.. పరిస్థితి ఎలా ఉండేదన్న అంచనానే వణికేలా చేస్తోంది. ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు ఢీ కొట్టిన ఉదంతంలో కుట్ర కోణం ఉందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కూటమిప్రభుత్వం.. ఈ అంశాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో కొత్త అంశాలు వెలుగు చూశాయి. కుట్ర కోణం ఏమైనా ఉందా? అన్న సందేహాలకు కొత్తగా వెల్లడైన అంశాలతో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన పలు అంశాల్ని చూస్తే.. కుట్ర కోణం ఏమైనా? ఉందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. ప్రకాశం బ్యారేజి గేట్లను ఢీ కొన్న మూడు పడవలకు సంబంధించి ఒక్కొక్క పడవ బరువు 40 నుంచి 50 టన్నుల (టన్ను అంటే వెయ్యి కేజీలు) బరువు ఉన్న బోట్లు కావటం కొత్త అనుమానాలకు తావిస్తోంది. అంతేకాదు.. సాధారణంగా ఏ బోటుకు ఆ బోటును ఉంచుతారు. కానీ.. ప్రకాశం బ్యారేజిని ఢి కొన్న బోట్లు మాత్రం ఒకదానికి మరొకటి కలిసి ఉండటాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రకాశం బ్యారేజి గేట్లను మొత్తం ఐదు పడవలు ఢీ కొట్టగా.. అందులో మూడు గొల్లపూడికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రివే అన్న విషయాన్ని గుర్తించారు. ఈ వక్కలగడ్డ ఉషాద్రి ఎవరోకాదు.. సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్ కు అనుచరుడు. ఇంతకూ రామ్మోహన్ ఎవరంటే.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలశిల రఘరాంకు దగ్గర బంధువు అన్న విషయాన్ని గుర్తించారు.

అంతేకాదు.. మాజీ ఎంపీ నందిగం సురేశ్ కు దగ్గరగా ఉంటారని.. రామ్మోహన్.. ఉసాద్రిలు మాజీ ఎంపీకి చెందిన లారీలకు ఇసుక సరఫరా చేసేవారని గుర్తించారు. అంతేకాదు.. బోట్లను కట్టేసిన తీరుపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా బోట్లను వేటికవే ఉంచుతారు. అది కూడా నది ఒడ్డున లంగరు వేసి కట్టేస్తారు. కానీ.. మూడు పడవల్ని కలిసి ప్లాస్టిక్ తాళ్లతో కట్టి ఉంచటం.. క్రిష్ణా నదిలో నీటిమట్టం పెరుగుతున్న సమయంలో.. ఏ పదవకు ఆ పడవను లంగరేసి గట్టిగా కట్టాలని స్థానికులు హెచ్చరించినా పట్టించుకోకపోవటంపై కొత్త సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పెద్ద పడవలైనప్పటికీ కొట్టుకు పోయి బ్యారేజీ వద్దకు వెళ్లే ప్రమాదం ఉందని చెప్పినా నిర్లక్ష్యం చేయటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. పోలీసులు ఈ సందేహాలకు తగిన ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు. నిందితుల కాల్ డేటా.. గూగుల్ టేకవుట్ వివరాల్ని సేకరిస్తున్నారు. అంతేకాదు.. రామ్మోహన్.. ఉషాద్రిలను పోలీసుల అదుపులోకి తీసుకొని వివరాలు రాబడుతున్నట్లుగా తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం వరకు గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్దండరాయనిపాలెం వైపు ఉండేవని.. కొద్ది రోజుల క్రితమే తీసుకురావటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు.. ఇలా తీసుకొచ్చిన బోట్లను గొల్లపూడి వద్ద ఎందుకు కట్టి ఉంచారు? అన్న సందేహానికి సమాధానాలు వెతుకుతున్నారు. మొత్తంగా మరికొద్ది రోజుల్లో ఈ కుట్ర కోణం ఒక కొలిక్కి వచ్చే వీలుందని చెబుతున్నారు. అప్పటివరకు తెర మీదకు వస్తున్న సందేహాల్ని నిజాలుగా మాత్రం భావించకుండా సంయమనాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నారు.