తగ్గేదేలే అంటున్న విజయ్... క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్!
ఈ మేరకు ప్రముఖ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ ఈ మేరకు విజయ్ కు సూచించారని.. ఇప్పటికే అన్నాడీఎంకే పళనిస్వామితో కూడా చర్చలు జరిపారనే ప్రచారం రెండు రోజులుగా బలంగా నడిచింది.;
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలాగైతే 2019 ఎన్నికల ఫలితాల అనంతరం 2024లో టీడీపీతో కలిసి పోటీ చేసి, సూపర్ విక్టరీ సాధించి ఉపముఖ్యమంత్రి పదవి పోందారో.. అదే విధంగా తమిళనాడులో కూడా టీవీకే అధినేత విజయ్ కూడా అన్నాడీఎంకేతో పొత్తు కుంటారంటూ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు ప్రముఖ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిశోర్ ఈ మేరకు విజయ్ కు సూచించారని.. ఇప్పటికే అన్నాడీఎంకే పళనిస్వామితో కూడా చర్చలు జరిపారనే ప్రచారం రెండు రోజులుగా బలంగా నడిచింది. ఈ సమయంలో తమిళగ వెట్రి కజగం (టీవీకే) స్పెషల్ సలహాదారు ప్రశాంత్ కిశోర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు.
అవును... ఊహాగానాలకు తెరదించుతూ తమిళగ వెట్రి కజగం పార్టీ ప్రత్యేక రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్... 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ స్వతంత్రగానే పోటీ చేస్తుందని.. తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోదని పేర్కొన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
అన్నాడీఎంకేతో పొత్తుకు అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు... ఒంటరిగా పోటీ చేయాలనేది నిబద్ధత అని.. అది మారే అవకాశం తనకు కనిపించడం లేదని.. విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే అతనికి చాలా మంచి అవకాశం ఉందని అన్నారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 సీట్లను సాధిస్తాడనే తాను నమ్ముతున్నట్లు నొక్కి చెప్పారు.
వాస్తవానికి... విజయ్ 40 లేదా 45 సీట్లతో సరిపెట్టుకోవడానికి పార్టీని ప్రారంభించలేదని టీవీకే ప్రధాన కార్యదర్శి ఆదయ్ అర్జున పేర్కొన్నప్పటికీ.. టీవీకే - అన్నాడీఎంకేల పొత్తుపై ఊహాగానాలు కొనసాగాయి. ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెడుతూ ప్రశాంత్ కిశోర్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
దీంతో... ముఖ్యమంత్రి స్టాలిన్, ప్రతిపక్ష నేత పళనిస్వామి వంటి సీనియర్ నాయకులతో పాటు.. ఉదయనిధి స్టాలిన్, బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నామలై వంటి యువనాయకులతోనూ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ పడనున్నారన్నమాట.