పీకే బీహార్ లో చిత్తు అవుతారా ?
ఎందరో సీఎంలను చేశాను అని పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ అనుకోవచ్చు. సినిమాలో దర్శకుడు అద్భుతంగా నటన ఇదీ అని చూపించి హీరోకి నేర్పించవచ్చు.
ఎందరో సీఎంలను చేశాను అని పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ అనుకోవచ్చు. సినిమాలో దర్శకుడు అద్భుతంగా నటన ఇదీ అని చూపించి హీరోకి నేర్పించవచ్చు. కానీ వెండి తెర మీద ప్రేక్షకులు నీరాజనాలు పట్టేది హీరోకే. అంటే ఆయనకు ఉన్న గ్లామర్ జనాకర్షణ ఇవన్నీ తోడు అవుతాయి.
అలా పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్ నేనే జగన్ ని సీఎం గా చేశాను లేక స్టాలిన్ సీఎం కావడానికి నా ఐడియాలే అరువిచ్చాను అనుకోవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ క్రేజ్ పెరగడానికి మోడీ 2014లో తొలిసారి దేశానికి ప్రధాని కావడానికి మమతా బెనర్జీ మూడవసారి పశ్చిమ బెంగాల్ సీఎం కావడానికి నేనే కారణం అని ఆయన అనుకున్నా తప్పులేదు.
కానీ నేనే బీహార్ సీఎం అని ప్రశాంత్ కిశోర్ భావిస్తే మాత్రం పప్పులోనూ తప్పులోనూ కాలేసినట్లే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బీహార్ అన్నది కులాల కురుక్షేత్రం. అక్కడ గత మూడు దశాబ్దాలుగా కుల సమరమే సాగుతోంది. పైగా కాంగ్రెస్ 1989లో అంతరించాక అక్కడ అయితే ఆర్జేడీ లాలూ లేకపోతే జేడీయూ నుంచి నితీష్ కుమార్ మాత్రమే ముఖ్యమంత్రులుగా అంతా చూశారు. లాలూ తన తరువాత సతీమణి రబ్రీదేవిని సీఎం ని చేసి ఏళ్లకు ఏళ్ళు తెర వెనక చక్రం తిప్పినా బీహార్ జనం నీరాజనం పలికారు తప్ప ఇదేమిటి అనలేదు.
ఇక లాలూ గడ్డి కుంభకోణం సహా అవినీతి ఆరోపణల మీద జైలుకు వెళ్ళినా ఆయనకు ఉన్న ఓటు బ్యాంక్ చెక్కు చెదరలేదు. లాలూ కుటుంబ పాలన అవినీతి పాలన అని బీజేపీ ఎంత అరచి గీ పెట్టినా ఆయన వైపే మెజారిటీ జనాలు ఉన్నారు. అంతవరకూ ఎందుకు 2020 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా ఆర్జేడీ ఉంది.
ఇక నితీష్ కుమార్ కూడా బీసీలు ఇతర కులాల ఆసరాతో నే రాజకీయం చేస్తూ వస్తున్నారు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రెండు పార్టీలతో సర్దుకుని ముందుకు పోతోంది. అటువంటి బీహార్ లో పీకే జనసూరజ్ పేరుతో పార్టీని పెట్టారు. ఆయన పార్టీ పెట్టడానికి ముందు పాదయాత్ర కూడా పెద్ద ఎత్తున చేశారు
ఆయన బీహార్ మొత్తం తిరిగి జనం గురించి తెలుసుకున్నారు. వారి విషయంలో ఆయన అవగాహన పెంచుకున్నారు. ఇక తాను అధికారంలోకి వస్తే సంపూర్ణ మధ్య నిషేధం అన్నారు. మహిళలకు టికెట్లలో వాటా అన్నారు. బీసీలు ఇతర వర్గాలకు కూడా గణనీయమైన స్థానం అన్నారు. ముస్లిం వర్గాలను కూడా ఆకట్టుకునేలా హామీలు ఇస్తున్నారు
అన్నీ బాగానే ఉన్నాయి కాబీ పీకే ఈ ఎన్నికల్లో ఎలా నెగ్గుకుని రాగలరు అన్నదే ప్రశ్న. ఆయన నితీష్ కుమార్ ని టార్గెట్ చేశారు. ఆయన ఆరోగ్యం మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఆర్జేడీని కూడా ఏకి పారేస్తున్నారు. ఆ రెండు పార్టీలే దశాబ్దాలుగా బీహార్ వెనకబాటుతనానికి కారణం అని కూడా ఆయన ఆరోపిస్తున్నారు.
ఇన్ని చేసినా బీహార్ ప్రజలు మాత్రం తమ నేతలుగా వారినే చూస్తారు అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ అక్షరాస్యత తక్కువ. పైగా వ్యక్తి పూజ, కులాభిమానం బాగా ఎక్కువ. లాలూ నితీష్ జనంలో పాతుకుని పోయారు. మరి వీరిని ఛేదించుకుని జనం మద్దతు పొందడం అంటే కష్టమనే చెప్పాలి.
బీహార్ లో ఈసారి జనసూరజ్ పార్టీ ఏ మేరకు తన ప్రభావాన్ని చూపిస్తుంది అన్నది చూడాలి తప్ప పీకే గెలిచి అధికారం అందుకుంటారు అన్నది మాత్రం అయ్యేది కాదు అని అంటున్నారు. వ్యూహాలు వేరు వాటిని అమలు చేసే ఇమేజ్ ఉన్న ఫిగర్ వేరు అన్నది ఈ ఎన్నికల తరువాత పీకేకు తెలుస్తుంది అని అంటున్నారు. జనామోదం ఉన్న ఫిగర్ ని ముందు పెట్టి ఎన్ని వ్యూహాలు చేసినా చెల్లుతుంది కానీ తెర వెనక వారే ముందుకు వస్తే జనాలు ఆదరించరు అన్న నగ్న సత్యం కూడా ఆయనకు బీహారీ జనం చెబుతారు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో .