పీకే పలుకు.. టీవీకేను గెలిపిస్తా.. తమిళనాడులో ధోనీని మించినోడినవుతా

వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విజయ్.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నారు. భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన సలహాలు తీసుకుంటున్నారు.

Update: 2025-02-26 11:37 GMT

సొంత రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే పట్టుమని పదివేల మంది వెంట రాలేదు.. ఆయన సలహాలు ఇప్పుడు రాజకీయ పార్టీలను గెలిపించలేకపోతున్నాయి.. కొద్ది రోజుల్లో ఆయనే స్వయంగా ఎన్నికలను ఎదుర్కోనున్నారు.. ఈ మధ్యలోనే కొత్తగా వచ్చిన ఓ పార్టీకి సలహాదారుగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే, ఆయన పనిచేయబోయేది కూడా సాధారణ నాయకుడి పార్టీ కాదు. తమిళనాడులో ఎంతో ఆదరణ ఉన్న హీరో స్థాపించిన పార్టీకి కావడమే విశేషం.

నిరుడు సరిగ్గా ఫిబ్రవరిలో తమిళ వెట్రిక కళగం (టీవీకే) పార్టీని స్థాపించారు దళపతి విజయ్. ప్రస్తుతం పార్టీ తొలి వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విజయ్.. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నారు. భవిష్యత్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన సలహాలు తీసుకుంటున్నారు.

డీఎంకే, అన్నాడీఎంకే వంటి 50 ఏళ్ల పైగా చరిత్ర ఉన్న పార్టీలను ఢీకొడుతూ.. 2026లో జరిగే ఎన్నికల్లో తమిళనాడులో టీవీకేను గెలిపిస్తానని అంటున్నారు ప్రశాంత్ కిశోర్. పార్టీ తొలి వార్షికోత్సవ సభలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ జార్ఖండ్ కు చెందినవాడైనప్పటికీ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడుతున్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి తమిళనాడులో ఉన్న క్రేజ్ ను ప్రస్తావించారు.

తమిళనాడులో ధోనీ చాలా పాపులర్ అని.. ఐపీఎల్ లో అతడు చెన్నై సూపర్ కింగ్స్ ను గెలిపించినట్లే, తాను టీవీకేను ఎన్నికల్లో గెలిపిస్తానని చెప్పుకొచ్చారు. అప్పుడు ధోనీ కంటే తమిళనాడులో తనకే ఎక్కువ పాపులారిటీ వస్తుందని అన్నారు.

సంతకం చేయలే..

ధోనీని మించి తమిళ ప్రజల ఆదరణ పొందుతానని అంటున్న పీకే.. టీవీకేకు తొలి వార్షికోత్సవ సభ సాక్షిగా ఝలక్ ఇచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా టీవీకే చేపట్టిన క్యాంపెయిన్ లో ఏర్పాటు చేసిన బ్యానర్ పై సంతకం చేసేందుకు మాత్రం నిరాకరించారు. ఈ మేరకు వీడియో వైరల్ అవుతోంది.

కొసమెరుపు: పీకే, ధోనీ ఉమ్మడి బిహార్ కు చెందినవారు. సరిగ్గా పీకే తమిళనాడులో ఉన్న బుధవారమే ధోనీ ఆ రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఐపీఎల్ ప్రాక్టీస్ కోసం చెన్నై చేరుకున్నారు.

Tags:    

Similar News