ప్రశాంత్ కిశోర్ ఉరఫ్ పీకే జగన్ మీద సంచలన జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఓటమి పాలు అవుతుందని అన్నారు. అది కూడా భారీ ఓటమి అని బిగ్ సౌండ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన పత్రికా కాంక్లేవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జగన్ ఓడిపోతున్నారు అని అన్నారు. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని అంటున్నారు.
అందుకే జగన్ ఏం చేసినా ఓటమి తప్పించుకోలేరని అన్నారు. ఏపీలో టీడీపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. పథకాల పేరిట డబ్బులు ఇస్తే ఓట్లు పడవని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని వివరించారు. ఇలా పీకే జోస్యం వదిలారు. దీని మీద వైసీపీ మంత్రుల నుంచి గట్టి ఎటాక్ స్టార్ట్ అయిపోయింది. పీకే జోస్యాలు ఎవరూ నమ్మరని మంత్రి అంబటి రాంబాబు ఘాటు జవాబు చెప్పారు.
2024 ఎన్నికల్లో పీకే జోస్యం 2019లో లగడపాటి రాజగోపాల్ జోస్యం లాంటిదే అన్నారు. దెబ్బకు లగడపాటి జోస్యాలు సర్వేలు మానుకుని సన్యాసం తీసుకున్నారని, ఇపుడు పీకే కూడా అంతే అని వ్యాఖ్యానించారు. మరో మంత్రి గుడివాడ అమరనాథ్ అయితే పీకేని మాయల ఫకీర్ అని అభివర్ణించారు.
ఆయన బీహార్ లో చెల్లని రూపాయి అని ఏపీలో చెల్లని రూపాయి చంద్రబాబు అని ఇద్దరూ కలసి ప్రజలను మభ్యపెడుతున్నారు అని మండిపడ్డారు. పీకే జోస్యాలు నమ్మే సీను ఎక్కడా లేనే లేదని గుడివాడ అన్నారు. మొత్తం మీద చూస్తే పీకే చెబుతున్న జోస్యం మీద చర్చ మొదలైంది.
ఇటీవలే పీకే బీహార్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను టీడీపీని ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడంలేదు అని అన్నారు. జస్ట్ కర్టెసీగా బాబుని కలిశాను అని చెప్పారు. ఇంతలో ఏమైందో ఆయన హైదరాబాద్ లో ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు దీనికంటే ముందు పీకే చంద్రబాబు నాలుగు రోజుల క్రితం భేటీ అయి సుదీర్ఘంగా చరించారు అని ప్రచారం సాగుతోంది.
ఈ చర్చలలో పీకే బాబుకు కొన్ని సూచనలు చేశారు అని కూడా వార్తలు వచ్చాయి. ఏపీలో చంద్రబాబు పవన్ కలసి మరిన్ని ఉమ్మడి సభలు నిర్వహించాలని కూడా పీకే సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా అభ్యర్థుల విషయంలో కూడా పీకే కీలకమైన సూచనలు చేసారు అని అంటున్నారు.
ఆ తరువాత ఇపుడు పీకే హైదరాబాద్ లో ఉంటూ ఇలా పత్రికా కాంక్లేవ్ లో పాలుపంచుకోవడం బట్టి చూస్తూంటే ఆయన టీడీపీకి ఈసారి ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేస్తారు అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పీకే మాటలను జనాలు ఎంతవరకు నమ్ముతారు అన్నది ప్రశ్న.
ఎందుకంటే ఉచిత పధకాలు మంచివి కావు అని ఈ రోజు సెలవు ఇస్తున్న పీకే 2019లో ఈ పధకాల గురించి చెప్పి వైసీపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టించారు అని కూడా అంటారు. ఏపీ అప్పుల కుప్ప కావడానికి పీకే వ్యూహాలే కారణం అని తెలుగుదేశం మీడియా ఇటీవల కాలం వరకూ ఆయన్ని తీవ్రంగానే విమర్శిస్తూ వ్యాసాలు రాసింది.
ఇక ఇపుడు పీకే ఉచిత పధకాలు ఎవరూ కోరుకోవడం లేదు అని అంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కూడా సూపర్ సిక్స్ పేరుతో వైసీపీ కంటే రెట్టింపు హామీలు ఇచ్చింది అదే విధంగా మరిన్ని హామీలకు సిధంగా ఉంది అని అంటున్నారు. మరి దాని మీద పీకే ఏమంటారు,
తెలంగాణాలో ఉచిత హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కర్ణాటకలో అదే జరిగింది. మరి దేశంలో ఉచిత హామీలకు ఓట్ల పంట పండుతున్న నేపధ్యం ఒక వైపు ఉంటే పీకే ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఎలా అర్ధం చేసుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద పీకే మళ్లీ వచ్చారు. ఈసారి ఆయన టీడీపీ వైపు ఉన్నారు. ఆయన సెంటిమెంట్ పండి టీడీపీ పవర్ లోకి వస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.