బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆర్ఎస్పీ!
తెలంగాణలో వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది.
తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారా? వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌పై వేటు పడటం ఖాయమా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ స్థానంలో అనూహ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను నియమిస్తారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. బడుగు, బలహీన వర్గాల ప్రజలను పార్టీ వైపు తిప్పుకోవడం కోసం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
తెలంగాణలో వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడింది. కాంగ్రెస్ దెబ్బకు ఓటమి పాలైంది. ఇక ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లోనైతే ఒక్క సీటు రాకపోవడం కేసీఆర్కు మరింత అవమానాన్ని తెచ్చింది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు కూడా పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రమాద సంకేతాలు కేసీఆర్‌కు తెలుస్తున్నాయి. అందుకే కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. బీజేపీ కూడా క్రమంగా పుంజుకుంటోంది. ఇక ఏపీలో అధికారంలోకి రావడంతో తెలంగాణపైనా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. టీడీపీ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీగా ముద్ర ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నాయకులు టీడీపీలోకి వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. దీంతో పార్టీలో బీసీలు, ఎస్సీల ప్రాధాన్యత పెరిగేలా కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఈ క్రమంలోనే దళిత, బహుజన వర్గాలకు పార్టీని చేరువ చేసేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరి కేసీఆర్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేస్తారో చూడాలి.