మోడీ.. ఇలా మునుపెన్నడూ లేదే!
భారత ప్రధానికి నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా విదేశాల్లోని భారతీయులు ఆయనను ఎంతగానో అభిమానిస్తుంటారు.
భారత ప్రధానికి నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ముఖ్యంగా విదేశాల్లోని భారతీయులు ఆయనను ఎంతగానో అభిమానిస్తుంటారు. మోడీ గత పదేళ్లలో ఆయా దేశాలకు వెళ్తున్నప్పుడు అక్కడి భారతీయులు ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. మోడీ.. మోడీ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.
కాగా సెప్టెంబర్ 22న నరేంద్ర మోడీ అమెరికాలోని న్యూయార్క్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అక్కడ భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ‘మోడీ–యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్’ పేరుతో నిర్వహించే కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండో – అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ యూఎస్‌ఏ మోడీకి ఘనంగా స్వాగతం పలకడానికి సిద్ధమైంది. దీనికి న్యూయార్క్ నగరంలోని నసావు వెటరన్స్ మెమోరియల్ కొలీజియాన్ని వేదికగా నిర్ణయించారు.
కాగా 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మోదీ న్యూయార్క్ లో జరిగిన భారీ కమ్యూనిటీ సమావేశానికి హాజరయిన సంగతి తెలిసిందే. న్యూయార్క్ లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్ లో ఈ కార్యక్రమం జరిగింది.
మళ్లీ 2019లో మోడీ అమెరికాలో పర్యటించారు. అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటయిన టెక్సాస్ లోని హ్యూస్టన్‌లో జరిగిన మెగా కమ్యూనిటీ ఈవెంట్‌లో పాల్గొన్నారు. అందులో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం పాల్గొనడం విశేషం.
ఇక ఇప్పుడు మోడీ – యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమానికి ఏకంగా 14 వేల మంది హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున సెలబ్రిటీలు కూడా వస్తారని చెబుతున్నారు. 500 మంది కళాకారులు, 350 మంది వలంటీర్లు, 85 మీడియా సంస్థలు, 40కి పైగా అమెరికా రాష్ట్రాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి. కార్యక్రమంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ప్రధాన వేదికపై గ్రామీ అవార్డ్ నామినీ చంద్రికా టాండన్, స్టార్ వాయిస్ ఆఫ్ ఇండియా విజేత ఐశ్వర్య మజుందార్ సహా వివిధ జాతీయ, అంతర్జాతీయ కళకారులు తమ ఆట,పాటలతో అలరించనున్నారు. అలాగే ఇంకో వేదికపై 117 మంది కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో అలరించనున్నారు.
మోడీ–యూఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమంలో భాగంగా ‘‘ఎకోస్ ఆఫ్ ఇండియా ఏ జర్నీ ఆఫ్ ఆర్ట్ అండ్ ట్రెడిషన్’’ నిర్వహించనున్నారు. ఇందుకోసం రెండు వేదికలను సిద్ధం చేస్తున్నారు.