ఆరోగ్యశ్రీని వదిలించుకుంటారా? కూటమి ప్రభుత్వంపై అనుమానాలు

ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోవడంతో సోమవారం నుంచి ఎన్టీఆర్ హెల్త్ కేర్ సేవలు నిలిపివేశారు.;

Update: 2025-04-07 10:49 GMT
ఆరోగ్యశ్రీని వదిలించుకుంటారా? కూటమి ప్రభుత్వంపై అనుమానాలు

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. బకాయిలు పేరుకుపోవడంతో సోమవారం నుంచి ఎన్టీఆర్ హెల్త్ కేర్ (ఆరోగ్యశ్రీ) పథకం కింద వైద్యం చేయలేమని నెట్ వర్కు ఆస్పత్రులు చేతులెత్తశాయి. దాదాపు రూ.3,500 కోట్లు బకాయి పెట్టడంతో తాము ఆస్పత్రులు నడపలేకపోతున్నామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. సిబ్బందికి జీతాలు చెల్లించలేపోవడంతోపాటు శస్త్రచికిత్సలకు అవసరమైన సామగ్రిని కొనలేకపోతున్నామని చెబుతోంది. బకాయిలు చెల్లించాలని కూటమి ప్రభుత్వానికి 26 లేఖలు రాసినా దేనికీ స్పందించలేదని, ఈ పరిస్థితుల్లో బంద్ చేయడం తప్ప మరో మార్గం లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయకుమార్ స్పష్టం చేశారు.

ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోవడంతో సోమవారం నుంచి ఎన్టీఆర్ హెల్త్ కేర్ సేవలు నిలిపివేశారు. బకాయిలు విడుదల చేయకపోతే సమ్మె చేస్తామని గత నెల 7న ప్రభుత్వానికి నెట్ వర్కు ఆస్పత్రులు లేఖ రాశాయి. కానీ, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ రోజు నుంచి సమ్మె చేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఏపీలో మొత్తం రూ.3,500 కోట్లు బకాయి పేరుకుపోయినట్లు ఆయన చెప్పారు. ఇందులో దాదాపు రూ.2,500 కోట్లు గత వైసీపీ ప్రభుత్వం చెల్లించాల్సినదేనని ఆయన వెల్లడించారు. కనీసం రూ.1,500 కోట్లు అయినా చెల్లించి ఆస్పత్రులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించినా ప్రయోజనం లేదని, అందుకే సమ్మెకి దిగినట్లు చెప్పారు.

ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో రోగుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి అత్యవసర వైద్యం అందిస్తున్నా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆ సేవలు కొనసాగించలేమని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు తేల్చిచెబుతున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం ఆస్పత్రులు నడపలేకపోతున్నామని అంటున్నారు. మందులు, శస్త్రచికిత్స పరికరాల సామగ్రి సరఫరాదారులు కూడా తమకు డెలివరీలను నిలిపివేశారని చెబుతున్నారు. 2025-26 బడ్జెట్ లో ఆరోగ్యశ్రీకి రూ.4 వేల కోట్లు కేటాయించారని, అయితే తమకు పాత బకాయే సుమారు రూ.3,500 కోట్లు ఉందని నెట్ వర్కు ఆస్పత్రులు వాపోతున్నాయి. కేటాయించిన బడ్జెట్ ప్రకారమైనా తమకు నిధులు సర్దుబాటు చేయాలని వేడుకుంటున్నాయి.

అయితే, ప్రైవేటు ఆస్పత్రులు ఎంత ఒత్తిడి చేసిన ప్రభుత్వం స్పందించకపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రం ఆరోగ్యశ్రీని వదిలించుకోవాలని చూస్తుండటమేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ లో ఆరోగ్యశ్రీని విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ కార్యదర్శి అవినాష్ ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్ లో తక్కువ ప్యాకేజీ రేట్లు ఉన్నాయని, దాదాపు 1500 వ్యాధులను మాత్రమే కవర్ చేస్తుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ వల్ల రోగులకు అందే వైద్యం నాణ్యత తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ప్రభుత్వ తీరుపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. రైజింగ్ ఏపీ అని పిలుచుకుంటూ పేదలకు ప్రాథమిక వైద్యం అందించలేకపోవడంపై ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీలో రూ.3,500 కోట్లు బకాయి పేరుకుపోవడం అవమానకరంగా ఉందన్నారు. గత తొమ్మది నెలలుగా బకాయిలు చెల్లించకపోవడం పేదల ఆరోగ్యంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని బయటపెట్టిందన్నారు. ఆరోగ్యశ్రీని నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని, బకాయిలు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News