తొలి అడుగులోనే విజయ ఢంకా.. రాహుల్‌ను బీట్ చేసిన ప్రియాంక
దేశవ్యాప్తంగా మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల కంటే ఉత్కంఠగా వయనాడ్ రిజల్ట్స్ కోసం ఎదురుచూశారు.
ఇటీవల జరిగిన వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తనయురాలు ప్రియాంకా గాంధీ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వయనాడ్ లో ప్రియాంకా గాంధీ తన సమీప ప్రత్యర్థి, సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై 4,08,036 ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. ఈ క్రమంలోనే తన సోదరుడు రాహుల్ గాంధీకి వయనాడ్ లో వచ్చిన 3.64 లక్షల ఓట్ల మెజారిటీ రికార్డును బద్దలు కొట్టారు.
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగిన ప్రియాంకా గాంధీ వయనాడ్ నుంచి రికార్డు విజయం సాధించి తొలిసారి లోక్ సభలో అడుగుపెట్టబోతున్నారు. 2024 ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలీ రెండు చోట్ల రాహుల్ గాంధీ గెలవగా...ఆయన బరేలీని ఎన్నుకున్నారు. దీంతో, వయనాడ్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజా గెలుపుతో వయనాడ్ లోక్‌సభ స్థానంలో అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిచిన అభ్యర్థిగా ఆమె రికార్డు సృష్టించారు.
తన సోదరిని వయనాడ్ బరిలో నిలుపుతానని నియోజకవర్గ ప్రజలకు రాహుల్ గతంలో హామీనిచ్చారు. ఈ క్రమంలోనే వయనాడ్ ఓటర్లు ఆమెను భారీ మెజారిటీతో గెలిపించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటివరకూ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రియాంకా గాంధీ వయనాడ్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ముందు సుముఖత చూపలేదట. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అయిన వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీని పోటీకి దింపాలని ఖర్గే ప్రతిపాదించారట. అయితే, అప్పటివరకూ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయని ప్రియాంకా గాంధీ...ఖర్గే ప్రతిపాదనను ఒప్పుకునేందుకు ముందు సంశయించారట. అయితే, సోనియా, రాహుల్ ల ప్రోద్బలంతో ఆమె పోటీకి ఒప్పుకున్నారట.