వాట్ నెక్స్ట్ : కాంగ్రెస్ ఓడుతున్న వేళ ప్రియాంక గెలిచారు !
హర్యానాలో కూడా 2019 నాటి కంటే సీట్లు ఎక్కువగా సాధించి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది.
దేశంలో కాంగ్రెస్ నానాటికీ పతనం అవుతోంది అని అంటున్నారు. హర్యానాలో రెండు సార్లు బీజేపీ గెలవడం వల్ల యాంటీ ఇంకెంబెన్సీ ఉందని కానీ మహారాష్ట్రలో ఇతర పార్టీలను చీల్చి అధికారం అందుకోవడం కోసం ఎన్నో రాజకీయ పనులు చేయడంలో కానీ బీజేపీ మీద జనాలకు ఎంతో కోపం ఉంది అనుకుంటే కాదు అని జనాలు ఓట్లెత్తి మరీ అధికారం అప్పగిస్తున్నారు.
ఇక బీజేపీ ఓడినా గౌరవప్రదంగా ఉంటోంది.జమ్మూ కాశ్మీర్ లో బీజేపీకి 28 సీట్లు వచ్చాయి. ఓట్ల శాతం కూడా పెరిగింది. ఇక మహారాష్ట్రలో అయితే ఓట్లూ సీట్లూ పెరిగాయి. హర్యానాలో కూడా 2019 నాటి కంటే సీట్లు ఎక్కువగా సాధించి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది.
ఇక దేశంలో బీజేపీ ఇపుడు కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంది. ఇండియా కూటమి కట్టినా కాంగ్రెస్ ప్రభ ఏమీ వెలగడం లేదు. అంతే కాదు రాహుల్ నాయకత్వం గొప్పగా ఏమీ వికసించడం లేదు అని అంటున్నారు. దాంతో బీజేపీ గెలవడానికి మోడీ ఇమేజ్ తో పాటు రాహుల్ గాంధీ ప్రత్యర్థిగా ఉండడం మరో కారణం అని అంటున్నారు.
రాహుల్ గాంధీని మోడీకి సమ ఉజ్జీగా చూడడం లేదా అన్న చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీ చూస్తే పార్లమెంట్ లో ధాటిగా మాట్లాడుతున్నారు మోడీ మీద గట్టిగా విమర్శలు చేస్తున్నారు. అయితే అవన్నీ జనాలకు సీరియస్ గా అనిపించడం లేదా అని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చాలా ఇబ్బందులలో పడిపోతోంది. నిజానికి మహారాష్ట్రలో అయిదేళ్ల పాటు రోత రాజకీయం సాగింది అని అంతా అనుకున్నరు. దాంతో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి గెలుస్తుంది అని భావించారు. కానీ జరిగింది వేరుగా ఉంది. లోక్ సభ ఎన్నికలో ఎంపీ సీట్లు ఎక్కువగా వచ్చాయి కాబట్టి అసెంబ్లీలో కూడా తమదే విజయం అనుకుంది కాంగ్రెస్ నాయకత్వంలో మహా వికాస్ అఘాఢీ కూటమి.
అతి విశ్వాసానికి పోయింది .నేల విడిచి సాము చేసింది. సీట్ల దగ్గర పంచాయతీ కూడా ఆ కూటమికి దెబ్బ కొట్టింది అని అంటున్నారు. ఇక రాహుల్ ప్రసంగాలు కూడా అంత పవర్ ఫుల్ గా లేవు అని అంటున్నారు. వీటికి మించి రాజకీయ వ్యూహాలు కూడా తేలిపోయాయని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఫలితాలు చావు దెబ్బ తీశాయి.
ఇక దేశంలో కాంగ్రెస్ పరిస్థితి ఏమిటి అన్నది కూడా చర్చకు వస్తోంది. సరిగ్గా ఈ టైం లో వయనాడ్ లో నాలుగు లక్షలకు పైగా భారీ ఓట్ల తేడాతో కాంగ్రెస్ నయా వారసురాలు ప్రియాంకా గాంధీ గెలిచారు. అచ్చం నానమ్మ ఇందిరగాంధీ పోలిక అని అంతా ఆమెను అంటూంటారు.
ఆమె స్పీచ్ బాగుంటుంది. ఆమె దూకుడుగానే ప్రసంగాలు చేస్తారు. ప్రత్యర్థుల మీద గట్టిగానే విమర్శల్తో శరసంధానం చేస్తారు. ఇపుడు కాంగ్రెస్ కి కొత్త ముఖం కావాలీ అంటే అది ప్రియాంకా గాంధీ అవుతారా అన్న చర్చ అయితే వస్తోంది. రాహుల్ గాంధీ కంటే కూడా ఓపికగా వ్యవహరించడం జనంతో మమేకం కావడంతో పాటు సరైన టైం లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రియాంకా గాంధీ ముందుంటారు అని అంటున్నారు.
అయితే ఇప్పటికిపుడు ఆమెకు పార్టీ పగ్గాలు దక్కుతాయని కాదు ఆమె అన్న రాహుల్ గాంధీకి చేయూతగా ఉంటూనే పార్టీలో తన పాత్రను స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ ఎంపీ పదవి ఒక సాధనం అని అంటున్నారు అంతే కాదు కాంగ్రెస్ శ్రేణులు ఆమె వైపు ఆశగా చూసేందుకు కూడా ఆస్కారం ఏర్పడుతోంది అంటున్నారు. సో కాంగ్రెస్ లో సరికొత్త ప్రియాంకం మొదలవుతుందా అంటే వెయిట్ అండ్ సీ.