ఆస్తి కోసం .. అమ్మ శవం

మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు అని కవి ఇలాంటి రాతి మనుషులను చూసే రాసి ఉంటాడేమో

Update: 2024-05-17 14:35 GMT

మాయమై పోతున్నడమ్మా మనిషన్న వాడు అని కవి ఇలాంటి రాతి మనుషులను చూసే రాసి ఉంటాడేమో. ఆస్తి లెక్కలు తేలలేదని అమ్మ శవాన్ని రెండు రోజులు ఫ్రీజర్ లోనే పెట్టి ఉంచిన విషాద ఘటన ఇది.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందులవారిగూడేనికి చెందిన వేము వెంకటరెడ్డి, లక్ష్మమ్మ (80) దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. గతంలోనే లక్ష్మమ్మ భర్త వెంకటరెడ్డి, చిన్న కుమారుడు కూడా చనిపోయారు . దీంతో నేరేడుచర్లలో ఉంటున్న చిన్న కుమార్తె వద్ద గత ఐదేళ్లుగా ల‌క్ష్మ‌మ్మ‌ ఉంటుంది. లక్ష్మమ్మ ఇటీవల కాలు జారి కింద‌ పడింది. దాంతో ఆమెను మిర్యాలగూడలోని ఓ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందించారు . ఆమె పరిస్థితి విషమించ‌డంతో ఇంటికి తీసుకెళ్లండని డాక్ట‌ర్లు సూచించారు.

దీంతో లక్ష్మమ్మను ఆక్సిజన్ స‌పోర్ట్‌తో చిన్నకుమార్తె తన ఇంటికి తీసుకెళ్లింది. బుధవారం రాత్రి 9 గంటలకు ఇంటి ముందు ఉన్న వెంచర్ వద్ద అంబులెన్స్ వ‌చ్చి ఆగింది. ఈలోగా లక్ష్మమ్మ కుమారుడు అక్కడికి చేరుకుని.. పెద్దమనుషులతో పంచాయితీ పెట్టించారు. లక్ష్మమ్మను కందులవారిగూడెం తీసుకెళ్తానని చెప్పడంతో.. మిగతా కూతుళ్లు ఆస్తి పంపకాలు తేలే వరకు అంబులెన్స్ కదిలేది లేదని పట్టుపట్టారు. చివరకు రాత్రి 11 గంటల సమయంలో లక్ష్మమ్మ కన్నుమూశారు.

మృతదేహాన్ని కందులవారిగూడెం తరలించినా కొడుకు కూతుళ్ల పంచాయితీ మాత్రం ఆగలేదు. లక్ష్మమ్మ గతంలో రూ.21 లక్షల వరకు పలువురికి అప్పులిచ్చారు. ఆమె ఒంటిపై 20 తులాల బంగారు ఆభరణాలున్నాయి. అయితే లక్ష్మమ్మ వైద్య ఖర్చులు భరించిన చిన్నకూతురికి రూ.21 లక్షల్లోంచి రూ.6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారు. మిగిలిన రూ.15 లక్షలకు సంబంధించిన పేపర్లను కుమారుడికి అప్పజెప్పారు. 20 తులాల బంగారు ఆభరణాలను ముగ్గురు కూతుళ్లు పంచుకున్నారు. అంతా అయిపోయిందిలే అనుకుంటున్నా సమయంలోనే కుమారుడు కొత్త పేచీ పెట్టాడు. తాను అంత్యక్రియల ఖర్చు భరించలేనని, తనకు డబ్బులిస్తేనే తలకొరివి పెడతానన్నాడు. శుక్రవారం ఉదయం పెద్ద మనుషులు అంత్యక్రియల ఖర్చుకు రెండు లక్షలు ఇప్పియడంతో ఆ పంచాయితీ కొలిక్కి వచ్చింది. ఆ తర్వాతనే అంత్యక్రియల‌ను నిర్వ‌హించడం విశేషం.

Tags:    

Similar News