ఫిబ్రవరి 14 చీకటి రోజుకు ఐదేళ్లు... నాడు అసలేం జరిగింది?

అవును... ఫిబ్రవరి 14 ఉదయం జమ్మూ నుండి 78 బస్సులతో కూడిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ శ్రీనగర్‌ కు బయలుదేరింది.

Update: 2024-02-14 11:09 GMT

దొంగదెబ్బ తీసి వీరులమని చెప్పుకుంటూ బ్రతికేస్తున్న కొంతమంది దుర్మార్గులు, భారతదేశ ఔన్యత్నాన్ని దెబ్బ తీసెందుకు, పచ్చని నేలను చూసి కళ్లు కుట్టిన ముష్కరులు సరిగ్గా ఐదేళ్ల క్రితం భారతదేశ చరిత్రపై నెత్తుటి మచ్చ వేసిన రోజు.. ఒక్కసారిగా భారతదేశం అట్టుడికిన రోజు.. సుమారు 40మంది భారతమాత ముద్దుబిడ్డలు అమరులైన రోజు.. సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదే రోజు ఏమి జరిగింది?

పుల్వామా దాడి ఇలా జరిగింది:

2019 ఫిబ్రవరి 14న జమ్ము శ్రీనగర్ జాతీయ రహదారిపై భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేథిపురాలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఈ బాంబు దాడి ప్రతిధ్వని సుమారు 10 కిలోమీటర్ల వరకు వినిపించింది. అనంతరం దట్టమైన పొగతో ఆ ప్రాంతమంతా కారు చిమ్మట్లు కమ్ముకుంది. ఈ దాడిలో 76వ బెటాలియన్‌ కు చెందిన 40 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సైనికులు మరణించారు.

అవును... ఫిబ్రవరి 14 ఉదయం జమ్మూ నుండి 78 బస్సులతో కూడిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ శ్రీనగర్‌ కు బయలుదేరింది. ఈ కాన్వాయ్‌ లో మొత్తం 2500 మందికి పైగా సైనికులు ఉన్నారు. ఈ సమయంలో ఉదయం 3 గంటల ప్రాంతంలో పుల్వామా మీదుగా కాన్వాయ్ వెళ్లేసరికి ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ కారుతో కాన్వాయ్‌ లోకి ప్రవేశించాడు.

సుమారు 100 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను అప్పటికే కారు నిండా నింపుకున్న ఆ ఉగ్రవాది... కాన్వాయ్ మధ్యలోకి వచ్చిన తర్వాత పేల్చేశాడు. దీంతో. ఆ పేలుడు దాటికి సీఆర్పీఎఫ్ 76వ బెటాలియన్‌ కు చెందిన 40 మంది వీరులు వీరమరణం పొందారు. ఆ పేలుడు అనంతరం గన్‌ పౌడర్ వాసన కొన్ని కిలోమీటర్ల వరకు గాలిలో వ్యాపించింది! చాలా దూరం నుంచి ఈ ఘటనను చూసిన వీక్షకులు సైతం వణికిపోయేలా ఆ దృశ్యం భయానకంగా ఉంది.

13 వేల పేజీల చార్జ్ షీట్.. 19 మంది ఉగ్రవాదుల పేర్లు!:

ఈ దారుణమైన ఘటనకు పాకిస్థాన్‌ లోనే కుట్ర జరిగింది! ఈ మొత్తం వ్యవహారంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్.ఐ.ఏ) దర్యాప్తు చేపట్టగా... ఐ.ఎస్‌.ఐ తోపాటు పాకిస్థాన్ ప్రభుత్వ సంస్థలు సైతం సంయుక్తంగా ఈ దాడికి ఎలా ప్లాన్ చేశాయో తెలిసింది! ఈ దాడిలో మసూద్ అజార్, అతని సోదరులు మౌలానా అమ్మర్ అల్వీ, అబ్దుల్ రవూఫ్ అస్గర్లను ప్రధాన నిందితులుగా పరిగణించారు. వీరితోపాటు మరికొంతమంది పేర్లను చేర్చారు.

ఇందులో భాగంగా... మహ్మద్ ఇస్మాయిల్, బిలాల్ అహ్మద్, మహ్మద్ అబ్బాస్, షాకీర్ బషీర్ పేర్లను కూడా ఎఫ్.ఐ.ఆర్. లో చేర్చారు! ఈ దాడికి సంబంధించి అసలు పేలుడు పదార్థాన్ని పాక్ నుంచి కాశ్మీర్ లోయకు ఎలా పంపబడింది, మొదలైన విషయాలను ఛార్జ్ షీట్ వివరించింది. ఈ ఛార్జ్ షీట్ 13 వేల పేజీలకు పైగా ఉండగా.. అందులో మొత్తం 19 మంది టెర్రరిస్టుల పేర్లు ఉన్నాయి.

ఫిబ్రవరి 26న చెప్పుదెబ్బ కొట్టిన భారత్!:

కుక్క కాటుకి చెప్పుదెబ్బ అంటారు! దాదాపు అదే స్టైల్లో అంతకు మించి అన్నట్లుగా పుల్వామా దాడికి రివేంజ్ తీర్చుకుంది భారత సైన్యం. ఇందులో భాగంగా... ఫిబ్రవరి 26న ఇండియన్ ఎయిర్‌ ఫోర్స్ రంగంలోకి దిగింది. పాక్ లోని బాలకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై సర్జికల్ స్ట్రయిక్‌ తో విరుచుకుపడింది. ఈ దాడిలో 300 మంది ఉగ్రవాదులు మరణించారు. ఇందులో సూసైడ్ బాంబర్ ఆదిల్‌ కు శిక్షణ ఇచ్చిన కమాండర్ రషీద్ ఘాజీ‌తో పాటు మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

దీంతో ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ లకు దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తారు.

ఆత్మహత్యకు అనుమతి కోరిన వీర జవాన్ల భార్యలు!:

భారతదేశంలో ఏ విషయమైనా వేడి వేడిగా ఉన్నప్పుడు రాజకీయంగా ఆ విషయాన్ని క్యాష్ చేసుకోవడానికి తీవ్రమైన పోటీ ఉంటుందని.. తర్వాత క్రమంగా ఆ విషయం సైడ్ కి వెళ్లిపోతుంటుందని.. మళ్లీ ఏడాదికి కొవ్వొత్తులతోనూ, రాజకీయ నాయకుల అద్భుతమైన స్టేట్ మెంట్స్ తోనూ విషయం మరోసారి తెరపైకి వస్తుంటుందని అంటుంటారు.

ఈ క్రమంలో 2019 పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల భార్యలు తాము ఆత్మహత్య చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని కోరాయి. ఇందులో భాగంగా ఈ ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత 2023 మార్చి లో ఈ మేరకు రాజస్థాన్‌ గవర్నర్‌ ను ఈ అనుమతి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో చావడం తప్ప తమకు మరో మార్గం లేదని వారు వాపోయారు.

దీంతో... ప్రభుత్వాల చిత్తశుద్ధిపై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి! కబుర్లు చెప్పడానికి, పొలిటికల్ గా క్యాష్ చేసుకోవడానికి చూపించే ఇంట్రస్ట్ ని కనీసం జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి కూడా చూపించకపోవడానికి మించిన దౌర్భాగ్యం మరొకటి ఉండదని తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి! ఎన్నికల సీజన్ వచ్చేసింది కాబట్టి... వారికి ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరాయనేది తెలియాల్సి ఉంది!

Tags:    

Similar News