పుంగనూరులో ఏం జరుగుతోంది.. కొత్త వివాదం...!
ఇదిలావుంటే.. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి(పలమనేరు), చల్లా బాబు(రామచంద్రారెడ్డి-పలమనేరు ఇంచార్జ్) సహా.. కీలక నేతలు కనిపించడం లేదు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవల చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. రాళ్ల దాడులు, లాఠీ చార్జి, వాహనాల దహనం.. వంటివి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. అయితే.. ఇది జరిగి వారం గడుస్తున్నా.. ఇక్కడ ఉద్రిక్తతలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.
ఇక, ఈ దాడుల్లో పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఒక కానిస్టేబుల్ కంటికి తీవ్ర గాయమై.. చూపు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇటు సర్కారు, అటు పోలీసులు కూడా.. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న వ్యవహారం.. మరోసారి ఉద్రిక్తతలకు దారితీసింది. గత అర్ధరాత్రి దాటిన తర్వాత.. ఈ కేసుల్లో ఉన్న బాధ్యుల కోసం.. సుమారు 200 మంది పోలీసులు జల్లెడ పడుతున్నారు.
ఇప్పటికే ఈ కేసుల్లో బాధ్యులుగా గుర్తించిన వారిలో 74 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు చెబుతుండ గా .. అంతకు రెండింతల మంది కార్యకర్తల జాడ కనిపించడం లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే.. మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి(పలమనేరు), చల్లా బాబు(రామచంద్రారెడ్డి-పలమనేరు ఇంచార్జ్) సహా.. కీలక నేతలు కనిపించడం లేదు. అయితే.. వీరు అజ్ఞాతంలో ఉన్నారనికొందరు చెబు తుండగా.. వారిని పోలీసులు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మరోవైపు ప్రభుత్వం కూడా.. ఈ కేసులను తీవ్రంగా భావిస్తోంది. ఈ కేసుల్లో ఉన్నవారిపై అత్యంత తీవ్రమైన ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసేలా ప్రయత్నం చేస్తున్నట్టు హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే.. ఈ కేసుల్లో అరెస్టయిన వారు బెయిల్ పొందేందుకు కూడా.. అనర్హులయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే అరెస్టయిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులను నమోదు చేయగా.. కీలక నేతలు, మాజీ మంత్రిపై ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు.. కేంద్రంతో హోం శాఖ అధికారులు సంప్రదిస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.