మతానికి కట్టుబడి.. శిక్ష అనుభవించిన మాజీ సీఎం.. ఉద్విగ్న ఘటన!
అలాంటి శిక్షలనే తాజాగా మాజీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ అనుభవించారు. పైగా 62 ఏళ్ల సుఖ్‌బీర్.. కాలికి తీవ్రంగా గాయంతో కట్టువేసుకుని వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు.
పదవులు అనుభవించమంటే ముందుంటారు. టికెట్లు ఇస్తామంటే ముందుకు వస్తారు. కానీ, శిక్షలు అనుభవించమంటే ఎవరైనా ముందుకు వస్తారా? ఎంత మత విశ్వాసం ఉన్న వారు కూడా.. రారు. పైగా.. సదరు విశ్వాసాలపైనే కోర్టులను ఆశ్రయించి న్యాయ పోరాటాలు చేసే రోజుల్లో ఉన్నాం. కానీ, పంజాబ్‌కు చెందిన మాజీ ముఖ్యమంత్రి(2007-17 మధ్య పదేళ్లు రాష్ట్రాన్ని పాలించారు), శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మాత్రం విశ్వాసానికి కట్టుబట్టారు. మత పెద్దలు చెప్పింది శివసావహించారు. వారు విధించిన శిక్షను అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. వీల్ చైర్‌లో వచ్చి.. అనుభవించారు. మత విశ్వాసాలకు నిలువుటద్దంగా నిలిచారు. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయం ముందు ఈటె పట్టుకుని వీల్ చైర్‌లో కూర్చుని రోజు రోజంతా కాపలా కాశారు. వచ్చిన వారివివరాలు రాసుకున్నారు.
నిజానికి సుఖ్‌బీర్ ఒక్కరే కాదు.. గతంలో ఆయన మంత్రి వర్గంలో పనిచేసిన మంత్రులు కూడా తాజాగా శిక్షను అనుభవించారు. ఈ శిక్షలు తిని కూర్చోవడం.. మీడియాతో మాట్లాడకుండా ఉండడవంటివి కాదు.. పదవులతోనూ.. హోదాలతోనూ సంబంధం లేకుండా.. వారు చేసిన `తప్పులకు` సిక్కుల అతిపెద్ద విచారణసంఘం `అకాల్ తఖ్త్` అత్యంత కఠినమైన శిక్షలే విధించింది. ఈ శిక్షలను వారు మళ్లీ చెప్పేవరకు అనుభవించాల్సిందే. అలాంటి శిక్షలనే తాజాగా మాజీ సీఎం సుఖ్‌బీర్ సింగ్ అనుభవించారు. పైగా 62 ఏళ్ల సుఖ్‌బీర్.. కాలికి తీవ్రంగా గాయంతో కట్టువేసుకుని వీల్‌చైర్‌కే పరిమితం అయ్యారు. అయినా.. ఆయన ఎక్కడా మత గురువులు ఇచ్చిన తీర్పును తోసిపారేయకుండా.. శిక్షలను అనుభవించడం.. ఇక్కడ కీలకమైన అంశం. ముందు తరాలకు ఆదర్శవంతం కూడా!!
ఇవీ.. శిక్షలు..
+ పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని ఉదయాన్నే శుభ్రంగా ఊడవాలి. చుట్టుపక్కల ఉన్న గురుద్వారాలను కూడా శుభ్రం చేయాలి.
+ స్వర్ణ దేవాలయం సహా.. గురుద్వారాలలోని వంట గదుల్లో అంట్లు తోమాలి.
+ దేవాలయాలకు వచ్చే భక్తులు.. వాడి వదిలేసిన వ్యర్థాలను శుభ్రం చేయాలి.
+ మరుగు దొడ్లను శుభ్రంగా కడగాలి.
+ మధ్యాహ్నం భోజనం వడ్డించాక.. పాత్రలను శుభ్రం చేయాలి.
+ గురుద్వారాల ముందు ఈటె పట్టుకుని కాపలాదారుగా నిలబడాలి.
+ ఈ శిక్షలు అనుభవించే సమయంలో తామెందుకు ఇలా శిక్షించబడిందీ.. రాసి ఉన్న పలకను అందరికీ కనిపించేలా మెడలో ధరించాలి.(ఇదే అతి పెద్ద శిక్ష).
ఎందుకీ శిక్ష?
2007-17 మధ్య అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మంత్రివర్గం.. సిక్కులు వ్యతిరేకించిన డేరా బాబా(గుర్మీత్ రామ్ రహీమ్)కు అనుకూలంగా వ్యవహరించింది. సిక్కు కాకపోయినా.. గుర్మీత్ సిక్కుల వేషధారణలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది 2015లో జరిగింది. దీనిపై పెద్ద ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో సుఖ్‌బీర్ సింగ్ మంత్రి వర్గం గుర్మీత్‌ను శిక్షించడం మానేసి.. ఆయనకు క్షమాభిక్ష పెట్టింది. ఇదీ.. వారు చేసిన నేరం. దీనిపై సిక్కుల విచారణ బృందం.. అకాల్ తఖ్త్ విచారించింది. ఈ సందర్భంగా అప్పటి సీఎం సహా మంత్రివర్గం తప్పును ఒప్పుకొంది. దీంతో పైవిధంగా శిక్షలు విధించారు. అంతేకాదు.. బాదల్ తండ్రికి ఇచ్చిన బిరుదును కూడా వెనక్కి తీసుకున్నారు. ఇన్ని చేసినా.. మాజీ సీఎం పంటి బిగువున భరించారు. ఇక్కడ ఓ షరతు కూడా ఉంది. వీటిని త్యాగ బుద్ధితో అనుభవించాలి. ఆయన అలానే చేశారు. ఎక్కడా బాధపడలేదు. తప్పునకు పశ్చాత్తాపంగానే భరించడం విశేషం.