మందు, డీజే లేని పెళ్లికి నగదు బహుమతి... ముందుకొచ్చిన గ్రామ పంచాయతీ!

అవును... ఇప్పటి వివాహ వేడుకల్లో విందు కంటే ముందు మందు ముఖ్యమనే మాటలు వినిపిస్తున్నాయి. వివాహ వేడుకల్లో విందు కంటే ముందు మందు కంపల్సరీ అనే పరిస్థితి వచ్చేసిందని అంటున్నారు.

Update: 2025-01-08 02:30 GMT

ఒకప్పుడు పెళ్లి అంటే... పందిళ్లు, సందళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు అనేవారు. అనంతరం.. మూడు ముళ్లు, ఏడు అడుగులు.. మొత్తం కలిసి నూరేళ్లు అని వర్ణించేవారు. అయితే ఈ రోజుల్లో నిండు నూరేళ్ల వివాహ బందాల సంగతి కాసేపు పక్కనపెడితే.. ఇప్పుడు పెళ్లి వేడుకల్లో మరో రెండు విషయాలు కొత్త వచ్చి చేరి, అత్యంత కీలకంగా మారాయి.

అవును... ఇప్పటి వివాహ వేడుకల్లో విందు కంటే ముందు మందు ముఖ్యమనే మాటలు వినిపిస్తున్నాయి. వివాహ వేడుకల్లో విందు కంటే ముందు మందు కంపల్సరీ అనే పరిస్థితి వచ్చేసిందని అంటున్నారు. వధూవరుల స్నేహితులు, బంధువులు ఓ రెండు చుక్కలు వేసి, సందడి చేస్తే ఆ లెక్కే వేరని, ఆ కిక్కే వేరని అంటున్నారు.

ఇప్పుడు దాదాపు ప్రతీ వివాహంలోనూ ఇది కామన్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా మందేసిన తర్వాత కాస్త చిందు వేయాలంటే కచ్చితంగా డీజే ఉండాల్సిన పరిస్థితి! డిక్ చిక్ డిక్ చిక్ డీజే సౌండ్ వినిపిస్తుంటే.. పిల్లలు, పెద్దలు కూడా ఆ సౌండ్స్ కి తగ్గట్లుగా డ్యాన్స్ చేస్తుంటే.. ఆ సందడే వేరని చెబుతున్నారు.

అయితే... ఇలాంటి వ్యవహారాలు లేకుండా వివాహం చేసుకుంటే నగదు బహుమతి ఇస్తామంటుంది ఓ గ్రామ పంచాయతీ. ఈ మేరకు తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగా... వివాహ వేడుకల్లో మద్యం పారించని, డీజే వినిపించని ఫ్యామిలీస్ కి రూ.21 వేలు నగదు ప్రోత్సాహకం అందిస్తామని ప్రకటించింది.

పంజాబ్ లోని భటిండా జిల్లాలోని బల్లో అనే గ్రామ పంచాయతీ ఈ మేరకు ఈ ప్రకటన చేసింది. ఈ ప్రకటన వెనుక ఓ కీలకమైన కారణం ఉందని చెబుతున్నారు. ఇందులో భాగంగా... పెళ్లిళ్లలో వృథా ఖర్చు చేయకుండా గ్రామస్థులను ప్రోత్సహించడానికి, మధ్యం దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ అమర్ జిత్ కౌర్ తెలిపారు.

ఈ సందర్భంగా స్పందించిన సర్పంచ్ అమర్ జిత్ కౌర్... వివాహ వేడుకల్లో మద్యం సేవించడం వల్ల గొడవలు జరగడం, డీజేల ద్వారా బిగ్గరగా మ్యూజిక్ వినిపించడం సాధారణం అయిపోయిందని.. ఈ భారీ సౌండ్స్ వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించడమే కాకుండా.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఇబ్బందులు కలిగిస్తుందని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే వివాహ వేడుకల్లో మద్యం పారించకుండా.. డీజే మ్యూజిక్ ప్లే చేయకుండా ఉంటే రూ.21,000 అందిస్తామని గ్రామ పంచాయతీ తీర్మానించిందని ఆమె తెలిపారు. కాగా... బల్లో గ్రామంలో సుమారు 5,000 జనాభా ఉన్నారు. దీంతో... ఆ రెండూ లేని వివాహ వేడుకలు ఈ రోజుల్లో సాధ్యమేనా అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం!

Tags:    

Similar News