పూరీ జగన్నాధుడి భాండాగారం ఓపెన్ పై అందుకే అంత ఆసక్తి

కట్ చేస్తే.. తాజాగా ఒడిశాలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం ఈ భాండాగారాన్ని తెరిచేందుకు డిసైడ్ అయ్యింది.

Update: 2024-07-12 05:38 GMT

దేశంలో అత్యధిక సంపద ఉన్న కేరళలో రంగనాయ స్వామి దేవాలయం తర్వాత అత్యంత అపురూపమైన ఆభరణాలు ఉన్న క్షేత్రంగా ఒడిశాలోని పూరీ జగన్నాథుడి శ్రీ క్షేత్ర రత్న బాండాగారంగా పేరుంది. అయితే.. ఇందులో ఉన్న బంగారు ఆభరణాలు ఎన్ని అన్న దానిపై క్లారిటీ లేదు. కారణం.. దాదాపు 46 ఏళ్లుగా దీన్ని తెరవలేదు. వెల కట్టలేని ఎన్నో ఆభరణాలు స్వామి వారికి ఉన్నాయి. వీటిని ఐదు కర్ర పెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. వాటిని అప్పుడప్పుడు లెక్క పెట్టేవారు. అలా చివరగా 1978లో లెక్కించారు. ఆ తర్వాత నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఆ బాండాగారాన్ని తెరిచింది లేదు.

కట్ చేస్తే.. తాజాగా ఒడిశాలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం ఈ భాండాగారాన్ని తెరిచేందుకు డిసైడ్ అయ్యింది. ఈ నెల 14న అంటే ఆదివారం దీన్ని తెరవాలని డిసైడ్ చేశారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఈ భాండాగారాన్ని ఉంచిన రహస్య ప్రదేశాన్ని రిపేర్లు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా వీటిని తెరవని కారణంగా.. వర్షపు నీరు వెళుతుందన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో.. ఈ భాండాగారాన్ని తెరిచే వేళలో ఆభరణాల లెక్కింపుతో పాటు.. ఆ ప్రాంతానికి అవసరమైన రిపేర్లు చేయాలని నిర్ణయించారు.

భాండాగారాన్ని తెరిచే అంశంపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీ తాజాగా ముగిసింది.కమిటీలోని పదహారు మంది సభ్యులు ఈ నెల పద్నాలుగున భాండాగారాన్ని తెరిచేందుకు నిర్ణయించారు. ప్రభుత్వానికి నివేదించారు. భాండాగారపు డూప్లికేట్ తాళం చెవి కలెక్టరేట్ లోని ట్రెజరీలో ఉంది. దీని ద్వారా తాళం తెరుచుకోకపోతే.. తాళం కప్పను పగలగొట్టి తలుపులు తెరవనున్నారు.

ఇంతకూ ఈ భాండాగారంలో ఏముందన్న విషయానికి వస్తే.. విలువైన వజ్ర వైడూర్యాలు.. గోమేధిక.. పుష్య రాగాలు.. కెంపులు.. రత్నాలు.. స్వర్ణాభరణాలు.. వెండి వస్తువులు భారీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విలువైన ఆభరణాల్నిచివరగా లెక్కించిన 1978లో వీటి విలువ లెక్కను తేల్చేందుకు 70 రోజులు పట్టింది. అప్పట్లో కొన్నింటి విలువ లెక్కించుకుండా వదిలేయటంతో వివాదం నెలకొంది. రహస్య గదులకు వర్షపు నీరు చేరి.. అక్కడి నిర్మాణాలు పాడు అవుతున్నట్లుగా వాదనలు ఉన్నాయి. వీటికి రిపేర్లు చేయాలని కోర్టులు 2018లోనే పరావస్తు శాఖను ఆదేశించాయి.

ఈ నేపథ్యంలో 2019 ఏప్రిల్ ఆరున అప్పటీ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 13 మంది సభ్యులతో కూడిన టీం వెళ్లగా.. రహస్య గది తాళం చెవి కనిపించలేదు. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు తీరి.. 16 మంది కమిటీ సభ్యులతో తలుపులు తెరిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి డూప్లికేట్ తాళంతో ట్రై చేస్తారు. అది కుదరకపోతే.. తాళాన్ని బద్ధలు కొట్టేస్తారు. దీంతో.. ఈ భాండాగారానికి సంబంధించిన విశేషాల కోసం కోట్లాది మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతకూ ఎంత భారీగా బంగారం.. వజ్రాభరణాలు ఉంటాయన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

భాండాగారాన్ని తెరిచే వేళలో ఎదురయ్యే ఇబ్బందుల్ని నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. తాజాగా ఉన్న అంచనా ప్రకారం విష సర్పాలు అక్కడ ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది. అంతేకాదు.. చిమ్మ చీకటిగా ఉండే సీక్రెట్ రూంలకు వెళ్లేందుకు కష్టమవుతుందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. సెర్చ్ లైట్లు.. స్నేక్ హెల్ప్ లైన్ నిపుణఉలు.. అత్యవసర వైద్యానికి అవసరమైన వైద్యులు కూడా పదహారు మంది టీంకు తోడుగా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి స్వామి వారి సంపదను వేరే చోట భద్రపరిచి.. ఆ ప్రాంతానికి రిపేర్లు చేస్తారు. అంతేకాదు.. ఆభరణాల బరువు.. తూకం.. నాణ్యత అంశాల్ని మదింపు చేసేందుకు ఆయా రంగాల్లోని నిపుణులను నియమించనున్నారు. మొత్తంగా స్వామి వారి సంపదపై మరికొద్ది రోజల్లో క్లారిటీ వస్తుందని చెప్పాలి.

Tags:    

Similar News