మా అబ్బాయిని ఓపెన్ ఏఐ చంపేసింది.. పూర్ణిమా రావు సంచలనం

భారత సంతతికి చెందిన 26 ఏళ్ల సుచిర్ బాలాజీ ఇటీవల అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. తన కొడుకు మరణంపై అతడి తల్లి పూర్ణిమారావు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-17 05:34 GMT

భారత సంతతికి చెందిన 26 ఏళ్ల సుచిర్ బాలాజీ ఇటీవల అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. తన కొడుకు మరణంపై అతడి తల్లి పూర్ణిమారావు షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐలో నాలుగేళ్లు పరిశోధనలు చేసిన విజిల్ బ్లోయర్ హత్యకు గురైనట్లుగా ఆమె ఆరోపిస్తున్నారు. ఓపెన్ ఏఐకు వ్యతిరేకంగా తన కొడుకు వద్ద ఆధారాలు ఉన్నాయని.. అందుకే హత్య చేసినట్లుగా ఆమె చెబుతన్నారు. తమ రహస్యాలు ఇతరులకు తెలీకుండా ఉండాలనే కారణంతోనే తన కొడుకును హత్య చేసినట్లుగా ఆరోపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

తాజాగా యూఎస్ లో టక్కర్ కార్లసన్ తో ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె తన కొడుకు మరణానికి కారణాలతో పాటు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన పలు విషయాల్ని బయటపెట్టారు. తన కొడుకు చనిపోవటానికి ఒక రోజు ముందు బర్త్ డే వేడుకల్ని జరుపుకున్నాడని.. ఒకవేళ అతను సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఆ వేడుకల్ని జరుపుకునే వాడా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.

సూసైడ్ చేసుకోవాలన్నదే అతడి ఆలోచన అయితే.. అతడి తండ్రి ఇచ్చిన గిఫ్టులను ఎందుకు తీసుకుంటాడు? ఓపెన్ ఏఐకు వ్యతిరేకంగా నా కొడుకు దగ్గర ఆధారాలు ఉన్నాయన్న ఆమె.. ‘‘అందుకే దాడి చేసి చంపారు. నా కొడుకు చనిపోయిన తర్వాత కొన్ని డాక్యుమెంట్లు కనిపించటం లేదు. చాట్ జీపీటీ రూపకర్తలు విచారణపై వారి ప్రభావాన్ని చూపారు. ఈ విషయం గురించి తెలిసిన స్థానికుల్ని తమ వైపు ఉంచుకున్నారు. నిజం చెప్పటానికి ఎవరూ ముందుకు రావటం లేదు. లాయర్లు సైతం దీనని ఆత్మహత్యగా చెబుతున్నారు. కేవలం పద్నాలుగు నిమిషాల వ్యవధిలోనే నా కొడుకు మరణాన్ని ఆత్మహత్యగా అధికారు తేల్చారు’’ అంటూ ఆమె చెబుతున్న మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

తన ఇంటర్వ్యూ పోస్టును ఎలాన్ మస్క్ ఎక్స్ లోనూ పోస్టు చేశారు. దీనికి స్పందించిన ఆయన.. దీన్నో తీవ్రమైన అంశంగా పేర్కొన్నారు. గత ఏడాది నవంబరు 26న బాలాజీ మరణించాడు. శాన్ ఫ్రాన్సిస్కోలోని తన అపార్టుమెంట్లో చోటు చేసుకున్న అతడి మరణం.. ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు దీన్ని ఆత్మహత్యగా పేర్కొన్నారు. దీనిపై అతడి తల్లి పూర్ణిమా రావు న్యాయపోరాటానికి దిగారు.

తన కొడుకు మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రైవేటు ఇన్వెస్టిగేటర్ ను నియమించుకొని రెండోసారి పోస్టుమార్టంనిర్వహించారు. ఆ ఫలితాలు పోలీసులు తెలిపిన దానికి భిన్నంగా ఉన్నట్లు ఇటీవల వెల్లడించారు. అపార్టుమెంట్ లో వస్తువుల్ని ఎవరో దోచుకున్నట్లుగా ఉందని.. బాత్రూంలో ఘర్షణ పడిన ఆనవాళ్లు ఉన్నాయని.. రక్తపు మరకలు కన్పించినట్లుగా పేర్కొన్న ఆమె.. ‘ఎవరో కొట్టి ఉంటారని అనిపిస్తోంది. ఈ ఘోరమైన హత్యను అధికారులు ఆత్మహత్యగా చెబుతున్నారు. దీనిపై ఎఫ్ బీఐతో దర్యాప్తు జరిపించాలి’’ అని పూర్ణిమా రావు కోరగా.. ఈ వ్యాఖ్యల పోస్టుపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఆత్మహత్యగా అనిపించట్లేదంటూ పేర్కొన్నారు. ఇప్పుడీ వ్యవహారం కొత్త దుమారంగా మారింది.

Tags:    

Similar News