కాంగ్రెస్ చేతితో కాంగ్రెస్ కళ్లు పొడి చేయడమంటే ఇదేనేమో..
పీవీకి భారతరత్న ఇవ్వడం, ప్రణబ్ స్మారకం నిర్మాణానికి స్థలం కేటాయించండం ద్వారా కాంగ్రెస్ పార్టీని బీజేపీ కార్నర్ చేయగలిగిందంటున్నారు.
ప్రధాని మోదీ రాజకీయ చతురత కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్కెచ్ వేశారంటే ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి అవ్వాల్సిందే. ఆయన వ్యూహ రచనతోనే బీజేపీ ప్రస్తుతం దేశంలో హవా చూపుతోంది. వరసుగా మూడోసారి గెలిచి కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడించాలనే ప్లానుతో పనిచేస్తున్నారు. ఇందుకోసం అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. పదేళ్లుగా పత్తాలేని కాంగ్రెస్ ఈ సారి ప్రతిపక్ష హోదా తెచ్చుకుని ప్రధానితో తలపడేందుకు ఉవ్విళ్లూరుతుండటంతో ఆ పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేసేలా పెద్ద బౌన్సర్ విసిరారు మోదీ.
మాజీ ప్రధాని మన్మోహన్ స్మారకం నిర్మించేందుకు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించిన స్థలాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి గతంలో కాంగ్రెస్ లేఖ రాసింది. దీనిపై కేంద్రం అధికారికంగా స్పందించకపోయనా బీజేపీ నాయకత్వం మాత్రం తీవ్ర విమర్శలు చేసింది. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ దివంగత మాజీ ప్రధాని పీవీ స్మారకాన్ని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించింది. మరోవైపు మన్మోహన్ సేవలకు తగిన గుర్తింపు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే మన్మోహన్ స్మారకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, మరో దివంగత నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్మారకం నిర్మించేందుకు రాజ్‌ఘాట్ ఆవరణలోని 'రాష్ట్రీయ స్మృతి' కాంప్లెక్స్‌లో స్థలాన్ని కేటాయించింది.
ప్రణబ్ స్మృతి చిహ్నం నిర్మించేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ స్థలాన్ని కోరకపోయినా, ఓ కాంగ్రెస్ వాదికి కేంద్రం గౌరవించడమే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ప్రణబ్ కుమార్తె శర్మిష్ట చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వ గౌరవాలను అడిగి తీసుకోరాదని, వాటంతట అవే వరించి రావాలని తన తండ్రి చెప్పేవారంటూ శర్మిష్ట వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అయిన ప్రణబ్ పలుమార్లు కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఇందిరా హయాం నుంచి కాంగ్రెస్ విధేయుడిగా పనిచేశారు. మన్మోహన్ స్థానంలో ప్రధాని పదవిని ఆశించిన ప్రణబ్ కోరిక తీరలేదు. కానీ, యూపీఏ-2 పాలనలో ఆయనను రాష్ట్రపతిని చేశారు. అయితే ఆయన ఆర్ఎస్ఎస్ ను అభిమానించేవారని చెబుతారు. ఓ సారి ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా పార్లమెంటులో వీర సావర్కర్ చిత్ర పటం పెట్టేందుకు ప్రణబ్ సహకరించారు.
వీటన్నిటకి కృతజ్ఞతగానే ఆయన స్మారకం నిర్మించేందుకు కేంద్రం స్థలం కేటాయించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ కోరినట్లు మన్మోహన్ స్మారకంపై ఇంకా నిర్ణయం తీసుకోకుండా ఆ పార్టీ సహనాన్ని పరీక్షిస్తోంది. వాస్తవానికి కాంగ్రెస్ నేతగా ప్రణబ్ స్మృతి వనం నిర్మించడం ఆ పార్టీ కర్తవ్యమేనంటున్నారు. అయితే ఆయన రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత మరణించడంతో పార్టీతో సంబంధం లేనట్లు కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఉండిపోయింది. ఇదే ఆ పార్టీని ఇప్పుడు ఇరుకన పెట్టినట్లైందని అంటున్నారు.
ప్రధాని మోదీ చాణక్యానికి ఈ సంఘటన తాజా ఉదాహరణగా చెబుతున్నారు. మన్మోహన్ ను గౌరవిస్తామని చెబుతూనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ స్మారకం నిర్మించేందుకు స్థలం కేటాయించడం ద్వారా కాంగ్రెస్ కు కక్కలేని మింగలేని పరిస్థితిని కల్పించారు. గతంలోనూ మరో కాంగ్రెస్ నేత, దివంగత మాజీ ప్రధాని పీవీ విషయంలోనూ ప్రధాని మోదీ ఇటువంటి నిర్ణయమే తీసుకున్నారు. 90వ దశకంలో కాంగ్రెస్ ప్రభ కోల్పోతున్న దశలో ఆ పార్టీని కాపాడి, ఐదేళ్ల పాటు మైనార్టీ సర్కారును నడిపిన పీవీ విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం లోపలకి రాకుండా అడ్డుకోవడమే కాకుండా, పీవీ అంత్యక్రియులు ఢిల్లీలో కాకుండా హైదరాబాద్లో జరిగేలా ఆయన భౌతిక కాయాన్ని తరలించారు. ఈ విషయంలో కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై ఇప్పటికీ విమర్శలు వినిపిస్తుంటాయి. బ్రాహ్మణ వర్గానికి చెందిన పీవీని కాంగ్రెస్ అవమానిస్తే, తాము సముచితంగా గౌరవించినట్లు చెప్పుకునేందుకు గత ప్రభుత్వంలో పీవీకి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
పీవీకి భారతరత్న ఇవ్వడం, ప్రణబ్ స్మారకం నిర్మాణానికి స్థలం కేటాయించండం ద్వారా కాంగ్రెస్ పార్టీని బీజేపీ కార్నర్ చేయగలిగిందంటున్నారు. భారతరత్న పీవీ ప్రభావం బీజేపీకి తెలంగాణలో ఎంతోకొంత కలిసొచ్చిందని చెబుతుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఆరు నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 54 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ సాధించి 8 పార్లమెంటు స్థానాలు గెలుచుకోగలిగింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో మమత ప్రభుత్వాన్ని పడగొట్టాలనే గట్టి పట్టుదల ప్రదర్శిస్తున్న బీజేపీ, దాదా (ప్రణబ్) ద్వారా సరికొత్త దారి వెతుక్కున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరు దివంగత కాంగ్రెస్ నేతల ద్వారా ఆ పార్టీని దెబ్బతీయడం అనే ప్రధాని రాజకీయ వ్యూహం హాట్ టాపిక్ గా మారింది.