మాజీ ప్రధాని జీవితంపై సినిమా.. ఆ నిజాలు వెలుగుచూస్తాయా?

ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించిన రథసారథి, తెలుగు బిడ్డ అయిన పీవీ నరసింహారావు జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్‌ తెరకెక్కుతోంది.

Update: 2024-02-29 12:30 GMT

ఇటీవల కాలంలో సినీ రంగంలో బయోపిక్‌ సినిమాలు సందడి చేస్తున్నాయి. వివిధ రంగాల్లో లబ్ధప్రతిష్టులైన వారి జీవితాలను సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ క్రీడాకారులు సచిన్‌ టెండ్కూలర్, మహేంద్ర సింగ్‌ ధోని, కపిల్‌ దేవ్, పీటీ ఉష, సైనా నెహ్వాల్, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, మహానటి సావిత్రి తదితరుల జీవితాలపై సినిమాలు తెరకెక్కాయి. వీటిలో కొన్ని విజయవంతం కాగా మరికొన్ని అపజయాలను మూటగట్టుకున్నాయి.

కాగా రాజకీయ రంగంలోని వారిపై వచ్చిన బయోపిక్‌ మూవీలు ఇప్పటివరకు తక్కువే. ఇప్పటివరకు వచ్చిన బయోపిక్‌ ల్లో ఎక్కువ క్రీడాకారులపై వచ్చినవే. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించిన రథసారథి, తెలుగు బిడ్డ అయిన పీవీ నరసింహారావు జీవిత కథ ఆధారంగా ఒక బయోపిక్‌ తెరకెక్కుతోంది. దీనికి 'హాఫ్‌ లయన్‌' అని పేరు పెట్టారు.

ఈ బయోపిక్‌ సిరీస్‌ ను ప్రముఖ ఓటీటీ ఆహా స్టూడియో, అప్లాజ్‌ ఎంటరటైన్మెంట్‌ కలిసి నిర్మిస్తున్నాయి. ఈ 'హాఫ్‌ లయన్‌' సినిమాను ప్రముఖ రచయిత వినయ్‌ సీతాపతి రాసిన పుస్తకం ఆధారంగా నిర్మిస్తున్నారు. దీనికి జాతీయ అవార్డు గ్రహీత ప్రకాశ్‌ ఝా దర్శకత్వం వహించనున్నారు.

ఇటీవల మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు మరణాంతరం భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీవీ బయోపిక్‌ రానుండటం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. ఆంధ్రప్రదేశ్‌ లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర ప్రభుత్వంలో పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన పీవీ నరసింహారావు 1990లో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. తనకు అత్యంత ఇష్టమయిన రచనా వ్యాసంగంపై దృష్టి సారించాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీని వదిలిపెట్టి ముంబైలో స్థిరపడాలనుకున్నారు. అయితే రాజీవ్‌ గాంధీ హత్య జరగడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో పీవీ నరసింహారావును వెతుక్కుంటూ ప్రధాని పదవి రావడం, ఆయన దాన్ని స్వీకరించడం జరిగిపోయాయి.

అయితే కాంగ్రెస్‌ కు 1991 ఎన్నికల్లో కేంద్రంలో పూర్తి మెజారిటీ లేదు. అయినా సంకీర్ణ సర్కారును ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పీవీ నరసింహారావు ఐదేళ్లపాటు విజయవంతంగా నడిపారు. దేశాన్ని అభివృద్ధివైపు పరుగులు పెట్టించారు. పరిశ్రమలకు అత్యంత సులువుగా అనుమతులు వచ్చేలా చేశారు. గతంలో ఉన్న చెత్త విధానాలను రద్దు చేశారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో చదువుకుని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ గా పనిచేసిన మన్మోహన్‌ సింగ్‌ కు దేశ ఆర్థిక మంత్రిగా పగ్గాలు అప్పగించారు.

అయితే పీవీ నరసింహారావు హయాంలోనే ఉత్తర ప్రదేశ్‌ లో బాబ్రీ మసీదు కూల్చివేయబడింది. అలాగే ప్రభుత్వాన్ని నిలుపుకోవడానికి ఎంపీలను కొనుగోలు చేశారనే అపప్రథ సైతం పీవీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. మరోవైపు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడిగా, దేశ ప్రధానిగా రెండు బాధ్యతలను పీవీ ఏకకాలంలో నిర్వహించారు. ఆయన మరణించాక తగిన విధంగా కాంగ్రెస్‌ పార్టీ నివాళి అర్పించలేదనే విమర్శలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు తెరకెక్కనున్న పీవీ బయోపిక్‌ 'హాఫ్‌ లయన్‌' లో ఏం చూపిస్తారు? అన్ని అంశాలకు ప్రాధాన్యత ఉంటుందా? అనేదానిపై ఆసక్తి నెలకొంది. భారతదేశాన్ని అద్భుతంగా పాలించిన ఈ తెలుగు తేజం గురించి కాంగ్రెస్‌ పార్టీ ఎప్పటినుంచో దాచిపెట్టిన కొన్ని వాస్తవాలను, ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఈ సిరీస్‌ చూపుతుందా అనేది ఆసక్తి రేపుతోంది.

Full View
Tags:    

Similar News