సీఎం చంద్రబాబు నివాసం వద్ద మరోసారి కొండచిలువ కలకలం!

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఓ పెద్ద కొండ చిలువ కలకలం రేగింది.

Update: 2024-10-24 07:20 GMT

వరదల సమయంలో లంక గ్రామాల్లోకి, నదీ పరివాహక ప్రాంతాల్లోకి పెద్ద పెద్ద పాములు, మొసళ్లు వస్తాయనేది తెలిసిన విషయమే! ప్రధానంగా లంక గ్రామాల్లో నివసించేవారికి ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. కొండచిలువలు వరదల్లో కొట్టుకు వచ్చి.. స్థానికంగా కలకలం రేపుతుంటాయి.

ఈ క్రమంలో.. ఇటీవల కృష్ణా నదికి భారీగా వరదలు వచ్చిన సంగతి తెలిసిందే! ఇటీవల కురిసిన భారీ వర్షాలకు విజయవాడ నీట మునిగింది. అదే కారణమో ఏమో కానీ... తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద ఓ పెద్ద కొండ చిలువ కలకలం రేగింది. ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

అవును... ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఓ పెద్ద కొండచిలువ కలకలం రేగింది. ఊహించని రీతిగా చంద్రబాబు నివాసం వద్ద ఉన్న మీడియా పాయింట్ వద్ద దాన్ని గుర్తించారు. అప్పటికే ఏదో జంతువును మింగిన ఆ కొండచిలువ.. చనిపోయినట్లు గుర్తించారు, వెంటనే సిబ్బందికి సమాచారమిచ్చారు.

అది చనిపోయి కనిపించింది కాబట్టి సరిపోయింది.. బ్రతికి ఉంటే ఎలాంటి అలజడి సృష్టించి ఉండేదో అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో... ఆ కొండచిలువను అక్కడి నుంచి తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు.

కాగా.. చంద్రబాబు ఇంటివద్ద కొండచిలువ ప్రత్యక్షం కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో 2017 మార్చి లో కూడా ఇలానే చంద్రబాబు ఇంటివద్ద కొండచిలువ కలకలం రేపింది. పైగా.. అది బ్రతికి ఉన్న కొండచిలువ. బాబు నివాసానికి సమీపంలోని కరకట్టకు ఇరువైపులా తనిఖీలు చేస్తున్న సమయలో ఈ కొండచిలువను అధికారులు గుర్తించారు.

అనంతరం.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో. .. అటవీశాఖ సిబ్బంది ఆ కొండచిలువను పట్టుకుని, మంగళగిరిలోని కొండప్రాంతంలో వదిలేశారు. అయితే... తాజాగా కనిపించిన కొండచిలువ మాత్రం చనిపోయి ఉంది.

Tags:    

Similar News