రఘురామ వెనక పవన్...మనసు చూరగొన్నారుగా !

ఏపీలో కూటమి ఏర్పాటుకు విశేషంగా కృషి చేసిన వారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఒకటికి వందసార్లు అయినా చెప్పక తప్పదు.

Update: 2024-11-17 03:25 GMT

ఏపీలో కూటమి ఏర్పాటుకు విశేషంగా కృషి చేసిన వారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని ఒకటికి వందసార్లు అయినా చెప్పక తప్పదు. ఎందుకంటే ఆయన తన సొంత రాజకీయం కంటే రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యమని అనుకుని చాలా విశాలంగా ఆలోచించారు. అలా కాదు అనుకుంటే ఆయన సొంతంగా పోటీ చేసేవారు.

అది చివరికి వైసీపీ వ్యతిరేక ఓట్ల చీలికకు దారి తీసి మరోమారు జగన్ గెలిచినా గెలిచేవారు. అలా కాకూడదు అని పవన్ ఒకటికి పది మెట్లు తగ్గారు. అంతే కాదు టీడీపీతో సీట్ల సర్దుబాటులోనూ ఎంతో ఉదారత్వం చూపించారు. బీజేపీకి ఎంపీ సీట్ల సర్దుబాటు కోసం తమ పార్టీకి దక్కిన ఒక ఎంపీ సీటుని వదులుకున్నారు.

అలాగే అసెంబ్లీ సీట్లను కూడా మూడు తగ్గించుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. కూటమి బలంగా ఉండాలని అంతా ఒక్కటిగా వైసీపీని ఎదుర్కోవాలని పవన్ పట్టిన పంతం సఫలీకృతం అయింది. ఇక ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా పవన్ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు.

ఆయన కూటమిలో ఎంతో సామరస్య ధోరణితో ఉంటున్నారు. నామినేటెడ్ పదవులు కానీ ఇతరత్రా పదవులు కానీ ఎక్కడా డిమాండ్ అయితే పెట్టడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇపుడు మరో కీలక పదవి విషయంలో పవన్ చూపించిన ఔదార్యం కూడా ఆయన కూటమి ఐక్యత పట్ల అలాగే అందరి మేలు పట్ల ఎంతలా ఆలోచిస్తారో అర్థం అయ్యేలాగా ఉందని అంటున్నారు.

తాజాగా ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా టీడీపీ ఎమ్మెల్యే రఘురామ క్రిష్ణం రాజు ఎన్నిక అయ్యారు. అయితే ఆయనకు ఈ పదవి దక్కడం వెనక పవన్ కళ్యాణ్ ఉన్నారని అంటున్నారు. నిజానికి చూస్తే స్పీకర్ పదవి టీడీపీకి డిప్యూటీ పదవి జనసేనకు అన్న అంగీకారం ఒకటి ఉందని అంటున్నారు. ఇక డిప్యూటీ రేసులో జనసేన నుంచి నెల్లిమర్లకు చెందిన శాసనసభ్యురాలు లోకం మాధవి, అలాగే నరసాపురానికి చెందిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ల పేరు ఉంది.

మరో వైపు చూఒస్తే రఘురామకు ఏ పదవీ కూటమి ప్రభుత్వంలో దక్కలేదు. దాంతో అన్నీ గమనించిన పవన్ కళ్యాణ్ సర్దుబాటుకు తానే చొరవ తీసుకుని ముందుకు వచ్చారని అంటున్నారు. ఆయన తమ పార్టీకి దక్కాల్సిన డిప్యూటీ స్పీకర్ పదవిని రఘురామ కోసం వదులుకున్నారు అని అంటున్నారు. దాంతో ఆ పదవిలో రఘురామ ఆసీనులు అయ్యారని ప్రచారం సాగుతోంది.

గతంలోనూ పవన్ ఒక రాజ్యసభ పదవిని వదులుకున్నారు. అది కూడా 2014 నుంచి 2019 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో రాజ్యసభ పదవి వస్తే కాదనుకోవడంతో అది రాయలసీమకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సీనియర్ టీడీపీ లీడర్ కి వెళ్ళింది. ఇలా చూస్తే కనుక పవన్ కి పదవుల మీద కంటే ప్రజా సమస్యల పరిష్కారం మీద అదే విధంగా రాష్ట్ర అభివృద్ధి మీదనే ఎక్కువ దృష్టి ఉందని అంటారు. మొత్తానికి పవన్ తీసుకున్న ఈ చొవరతో రఘురామ ఫుల్ హ్యాపీస్ అని అంటున్నారు. అంతే కాదు వైసీపీ మీద రెబెల్ ఎంపీగా ఆయన చేసిన పోరాటానికి ఒక గుర్తింపు కూడా లభించింది అని అంటున్నారు.

Tags:    

Similar News