రఘురామ ఆవేదనకు కారణమేంటి? ఆ ప్రశ్నలకు సమాధానం ఉందా?
తనను పోలీసు కస్టడీలో వేధించిన వారిపై చర్యలకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుండటం ఆయనకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నట్లు కనిపిస్తోంది.
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వాయిస్ పెంచుతున్నారు. తనను పోలీసు కస్టడీలో వేధించిన వారిపై చర్యలకు ప్రభుత్వం వెనకడుగు వేస్తుండటం ఆయనకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నట్లు కనిపిస్తోంది. సమయం వచ్చినప్పుడు ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుంటాననే రీతిలో ఆయన హెచ్చరికలు జారీ చేస్తుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
‘నా కస్టోడియల్ టార్చర్ కేసులో నిందుతులైన సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమారులను ఇంతవరకు ఎందుకు విచారణకు పిలవడం లేదు. ఎఫ్ఐఆర్ లో నిందితులుగా చేర్చినప్పుడు వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలి కదా? ఆ పని ఎందుకు చేయడం లేదు. వారి విషయంలో భయపడుతున్నారా? ఈ విషయంలో ప్రశ్నించదలచుకున్న వారిని తప్పనిసరిగా ప్రశ్నిస్తా’ అంటూ తేల్చిచెప్పారు రఘురామ. దీంతో కస్టోడియల్ టార్చర్ కేసులో ప్రభుత్వ తీరుపై ఆయనలో అసహనం పెరిగిపోతున్నట్లు ప్రచారం జరగుతోంది.
వైసీపీ ఎంపీగా ఉండగా రఘురామపై దేశద్రోహం కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్టుకు ముందే అప్పటి గుంటూరు కలెక్టర్ వీఐపీ వస్తున్నారు. అప్రమత్తంగా ఉండండి అంటూ జీజీహెచ్ సూపరింటెండెంట్ కు లేఖ రాసినట్లు రఘురామ ఆరోపిస్తున్నారు. ఈ లేఖే తనపై కేసు నమోదుకు కుట్ర జరిగిందన్నదానికి బలమైన ఆధారంగా చెబుతున్నారు. దీంతో అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్ ను ప్రశ్నించాలని రఘురామరాజు డిమాండ్ చేస్తున్నారు. నా అరెస్టు కన్నా ముందే గుండె జబ్బులు చూసే వైద్యులను సిద్ధం చేసి ఉంచాలని జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతికి కలెక్టర్ ఎలా రాఖ రాశారని రఘురామ నిలదీస్తున్నారు. ఎవరి రిఫరెన్స్ మేరకు ఆయన అలా లేఖ రాయాల్సివచ్చిందో తెలుసుకోవాలని విచారణాధికారులను కోరారు.
ఒక కేసులో నిందితుడికి ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యులను అందుబాటులో ఉంచాలని కేసు దర్యాప్తు అధికారి అడగాలి. అది సబబు, కానీ కలెక్టర్ కోరడం చూస్తేనే కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. తనను విజయవాడ పరిసరాల్లో ఏదో చేసి కొన ఊపిరితో ఆస్పత్రికి తీసుకువెళ్లాలని ప్లాన్ చేసినట్లుగా రఘురామ ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసులో రఘురామ గుండెలపై కూర్చొని దాడి చేసిన నిందితుల గుర్తింపు ప్రక్రియ ఆదివారం గుంటూరు జిల్లా జైలులో చేపట్టారు. తనపై దాడి చేసిన నిందితుడిని తాను గుర్తించానని, ఆ సమయంలో నిందితుడు తులసిబాబు ముఖానికి కట్టుకున్న కర్చీప్ జారిపోవడతో తాను సులువుగా గుర్తించగలిగానని రఘురామ చెబుతున్నారు.
మరోవైపు కేసులో ప్రధాన నిందితులైన ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులుపై విచారణ చేపట్టాలని విచారణ కమిటీ అధికారులు ఆర్పీ సిసోడియా, హరీశ్ కుమార్ గుప్తాలను రఘురామ కోరుతున్నారు. ఇలా ఆయన గతంలో ఎన్నడూ లేనట్లు స్వరం పెంచి మాట్లాడటంతో కేసు విచారణపై ఆయన అసంతృప్తితో ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమిలో కీలకంగా పనిచేస్తున్న తనకే న్యాయం దక్కకపోతే ఎలా అనేది ఆయన ఆవేదనగా కనిపిస్తోంది.
మరోవైపు ఈ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సహకరించడం రఘురామకు రుచించడం లేదు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమారుతో రాముకు ఎలాంటి బంధం ఉన్నా, ఈ కేసులో ఆయన జోక్యం చేసుకోకూడదని రఘురామ భావిస్తున్నారు. ఈ విషయంలో పార్టీ కూడా రామును ప్రశ్నించకపోవడంపై డిప్యూటీ స్పీకర్ రగిలిపోతున్నారని చెబుతున్నారు. సమయం కోసం చూస్తున్నారని, ఈ విషయంలో తాడోపేడో తేల్చుకోవాలని ఆయన భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.