వైసీపీలో నెంబర్ 2 ప్లేసుకు రిస్క్ ఎక్కువ : రఘురామ

ఈ విషయం తాను ఎన్నికలకు ముందే చెప్పానని, ఇప్పుడు ఆ మాటలు నిజమవుతున్నాయని వ్యాఖ్యానించారు.

Update: 2025-01-30 21:30 GMT

గోదావరి చమత్కారంతో మాటలు తూటాలు పేల్చే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామక్రిష్ణంరాజు మరోమారు మాజీ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ వ్యక్తిత్వాన్ని ఎండగడుతూ ఆ పార్టీలో ఎవరూ ఉండరని తేల్చేచారు. ఈ విషయం తాను ఎన్నికలకు ముందే చెప్పానని, ఇప్పుడు ఆ మాటలు నిజమవుతున్నాయని వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష వైసీపీలో ఇటీవల చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు మరోసారి స్పందించారు. ఇటీవల ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభా పక్ష నేత విజయసాయిరెడ్డి రాజీనామాను ప్రస్తావిస్తూ ఎన్నికల అనంతరం వైసీపీ ఖాళీ అవుతుందని నేను ముందుగానే చెప్పానని గుర్తు చేశారు. జగన్ లాంటి వ్యక్తితో రాజకీయం చేయడం చాలా కష్టమని రఘురామ వ్యాఖ్యానించారు.

‘‘వీఎస్ఆర్ లాంటి వ్యక్తులే కాదు చీము, నెత్తురు ఉన్నవారు ఎవరూ ఆ పార్టీలో ఉండరని నేను గతంలోనే చెప్పాను. జగన్ ఒక యూనిక్ క్యారెక్టర్. అతను ఎవరినీ దగ్గర ఉంచుకోలేరు. ఆ పార్టీలో నంబర్ 2 అంటే బయటకు వెళ్లడానికి రెడీ అయినట్లే. ఆ రెండో ప్లేస్ అనేది చాలా రిస్క్’’ అంటూ రఘురామ చెప్పుకొచ్చారు.

ఎన్నికలకు ముందు వరకు రఘురామరాజు వైసీపీ ఎంపీగా వ్యవహరించిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి గెలిచిన ఆరు నెలలకే వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేసిన రఘురామరాజుపై వైసీపీ చాలా కఠినంగా వ్యవహరించింది. రాజద్రోహం కేసు పెట్టి జైల్లో వేయించింది. ఇక ఐదేళ్లు సొంత నియోజకవర్గంలోనే ఆయన అడుగుపెట్టలేని పరిస్థితి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా రోజూ రచ్చబండ పేరిట రచ్చ రచ్చ చేసిన రఘురామరాజు వైసీపీపై విమర్శలకు ఎప్పుడూ ముందుంటారు. గత ఏడు నెలలుగా వైసీపీ నుంచి ముఖ్యనేతలు రాజీనామా చేస్తుండటంపై రఘురామ తన మార్కు విశ్లేషణతో రాజకీయ వర్గాలను ఆకర్షించారు.

Tags:    

Similar News