'వాడు వీడు కాదు.. ఇకపై జగన్ గారు'... ట్రిపుల్ ఆర్ వీడియో వైరల్!
ఏపీలో కూటమి కొలువుదీరిన కొన్ని రోజుల తర్వాత మంత్రిపదవి రాని విషయంలో రఘురామ చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
ఏపీలో కూటమి కొలువుదీరిన కొన్ని రోజుల తర్వాత మంత్రిపదవి రాని విషయంలో రఘురామ చేసిన వ్యాఖ్యలు కాస్త చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఇక సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి మొదటి రోజు నుంచి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం మరింత చర్చనీయాంశం అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.
అవును... ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నల్ల కండువాలతో అసెంబ్లీకి నిరసనగా వచ్చిన వైఎస్ జగన్ తో రఘురామ కాసేపు మాటామంతీ జరపడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్న నేపథ్యంలో... పలు టీవీ ఛానల్స్ కి కలిపి, విడివిడిగా కూడా రఘురామ వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ తనను "అన్న" అని సంబోధించినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా... ఏపీ అసెంబ్లీ ప్రధానప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ.. ఉన్న ఒక్క ప్రతిపక్ష పార్టీకీ శాసనసభా పక్ష నేత మీరే కాబట్టి.. అసెంబ్లీ సమావేశాలకు రండి జగన్ అని సూచించినట్లు రఘురామ తెలిపారు. దీనికి సమాధానంగా.. ఎలాంటి కోపం, చికాకూ లేకుండా నార్మల్ గానే... "సరే అన్న" అని జగన్ తనతో అన్నారని.. తనను ఎప్పుడూ జగన్ "అన్న"అనే సంభోదిస్తారంటూ రఘురామ చెప్పుకొచ్చారు.
అయితే... ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందుదిగా ఉన్న ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... జగన్ ని గతంలో "వాడు.. వీడు" అని సంభోదించిన విషయన్ని గుర్తుచేసుకున్న రఘురామ, అందుకు గల కారణాన్ని వివరించారు. ఇదే సమయంలో ఇకపై ఎప్పుడూ జగన్ ని అగౌరవంగా సంభోదించనని.. మాజీ ముఖ్యమంత్రిగా ఇకపై ఎప్పుడూ గౌరవంగానే మాట్లాడతానని తెలిపారు.
ఇందులో భాగంగా... "గతంలో జగన్ మోహన్ రెడ్డి గారిని వాడూ వీడూ అని కొన్ని సార్లు మాట్లాడి ఉండొచ్చు.. అప్పుడు తనను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి.. ఆవేశమో, మరెందుకో కానీ కొన్ని సందర్భాల్లో వాడూ, వీడూ అనడం జరిగింది. ఇప్పటి నుంచి నేను వయసులో నాకంటే చిన్నవాడైనా, స్నేహితుడి కొడుకైనప్పటికీ.. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిగా ఆయనను నేను గౌరవంగానే సంబోధిస్తాను" అని రఘురామ తెలిపారు.
దీంతో... మార్పు మంచిదే కానీ, హుందా తనంతో కూడిన రాజకీయాలు ఆహ్వానించదగ్గ పరిణామాలే కానీ.. ఉన్నపలంగా రఘురామ కృష్ణంరాజులో ఇంత భారీ మార్పు ఎందుకనేది మాత్రం నెట్టింట వైరల్ టాపిక్ గా మారింది.