తప్పుల నుంచి నేర్చుకోవటమా? ఇంకెనేళ్లు కావాలి రాహుల్?

తాజాగా ఆయన బిహార్ రాజధాని పట్నాలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.;

Update: 2025-04-08 06:30 GMT
తప్పుల నుంచి నేర్చుకోవటమా? ఇంకెనేళ్లు కావాలి రాహుల్?

కొన్నిసార్లు ఎంతో సెన్సెబుల్ గా మాట్లాడే కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. మరికొన్నిసార్లు ఆయన నోటి నుంచి వచ్చే మాటల్ని వింటే.. ఇవన్నీ రాహుల్ గాంధీనేనా మాట్లాడుతుందన్న భావన కలుగుతుంది. అదే పనిగా ఓటమి తలుపు తడుతున్నా.. ఆయన తీరులో మార్పు లేదన్న ఆవేదన కాంగ్రెస్ లోని ఒక వర్గంలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆయన బిహార్ రాజధాని పట్నాలో నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. బిహార్ లో కాంగ్రెస్ చేయాల్సినంతగా చేయలేదని.. పార్టీ తరఫున ఆ విషయాన్ని అంగీకరిస్తున్న తొలి వ్యక్తిని తానేనని పేర్కొన్నారు. తాము చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటున్నామని.. ఆర్జేడీ.. వామపక్షాలతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అణగారిన వర్గాల కోసం శ్రమిస్తామని వ్యాఖ్యానించారు.

బిహార్ లో కొత్తగా ఏర్పాటు చేసిన మూడింట రెండొంతుల జిల్లా కాంగ్రెస్ కమిటీలకు అణగారిన వర్గాల నాయకులే నాయకత్వం వహిస్తున్న సంగతి గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యల్ని చూసినప్పుడు రాహుల్ నిజాయితీగా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్న తప్పులు గుర్తుకు రాకమానదు. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయటం ఎందుకు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాటి గురించి చెప్పుకోవటం ఎందుకు? అలాంటి తప్పులు అధికారంలో ఉన్నప్పుడే జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటే.. ఇలా తప్పులు ఒప్పుకోవాల్సిన అవసరం ఉండదు కదా? ఇప్పటికైనా.. తన తీరును రాహుల్ మార్చుకుంటారా? ఆ ఆలోచన ఆయనలో ఉందంటారా?

Tags:    

Similar News