రాహుల్ త్యాగమూర్తి కావాల్సిందే !

దేశంలో బీజేపీ హవాకు అడ్డుకట్ట వేయడం కాంగ్రెస్ సహా ఇండియా మిత్రులకు ఇపుడు దాదాపుగా అసాధ్యమనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది

Update: 2025-02-09 03:37 GMT

దేశంలో బీజేపీ హవాకు అడ్డుకట్ట వేయడం కాంగ్రెస్ సహా ఇండియా మిత్రులకు ఇపుడు దాదాపుగా అసాధ్యమనే భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఇండియా కూటమిలో ఉన్న పార్టీల మధ్య సఖ్యత లేదు, తటస్థ పార్టీలు కూడా చేరేందుకు కాంగ్రెస్ అడ్డు వస్తొంది. దాంతో కాంగ్రెస్ పార్టీయే ఇండియా కూటమికి బిగ్ ట్రబుల్ గా మారుతోందా అన్న చర్చ కూడా ఉంది.

ఈ నేపథ్యంలో దేశంలో మోడీ పాలనను అంతం చేయాలని లేదా ఎన్డీయేను దించాలని అనుకున్నా కూడా ఇండియా కూటమిలో పెద్దన్న పాత్రను కాంగ్రెస్ వదులుకోవాల్సిందే అన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఒక రకంగా ఇది త్యాగమే అని అంటున్నారు. ఈ రకమైన త్యాగం చేయడం కాంగ్రెస్ కి కొత్త కాదు. 1996లో కాంగ్రెస్ కి మెజారిటీ రాక ఓటమి పాలు అయినపుడు ప్రాంతీయ పార్టీలను వామపక్షాలను ముందు పెట్టి తాను కేవలం మద్దతు పార్టీగా ఉండి రెండేళ్ళ పాటు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర ఉంది.

అందువల్ల కాంగ్రెస్ మరోసారి ఆ రకమైన ఆలోచన చేస్తేనే తప్ప ఇండియా కూటమి బతికి బట్ట కట్టదని అంతా ఐక్యంగా ఉండలేరని విశ్లేషణలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ కనుక తన సారథ్యాన్ని పక్కన పెట్టి మిత్ర పార్టీలకు అవకాశం ఇస్తే ఇండియా కూటమి బలోపేతం అయ్యేందుకు వీలు కలుగుతుంది అని అంటున్నారు. అదెలా అంటే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకే పగ్గాలు అప్పగిస్తే మిగిలిన పార్టీలు అన్నీ కూడా ఆమెకు సపోర్టు చేస్తాయి.

అంతే కాదు కాంగ్రెస్ సారధ్యం కనుక ఇండియా కూటమికి లేకపోతే అపుడు ఏపీలో వైసీపీ తెలంగాణా నుంచి బీఆర్ ఎస్ వంటి పార్టీలు కూడా ఇండియా కూటమిలో చేరేందుకు వీలు ఉంటుందని అంటున్నారు. అలాగే ఒడిషాలో బిజూ జనతాదళ్ కూడా ఈ కూటమి వైపు వచ్చినా రావచ్చు అని అంటున్నారు.

దీంతో పాటు కాంగ్రెస్ ఆ పార్టీ అధినాయకత్వం మరిన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. అదెలా అంటే వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు బలంగా ఉన్న చోట కాంగ్రెస్ వాటికి మద్దతు ఇచ్చి పోటీకి దూరంగా ఉండడం. దాని వల్ల మిత్రులు గెలుస్తారు, ఇండియా కూటమి బలోపేతం అవుతుంది. అయితే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ని జూనియర్ పార్టనర్ గా చూస్తారా అంటే మరి ఆయా రాష్ట్రాల్లో బలాబలాలు బట్టే ఇదంతా ఆధారపడి ఉంటుంది.

ఒక్క మాటలో చెప్పాలీ అంటే కాంగ్రెస్ కూడా ఎలాంటి ఆభిజాత్యాలు ప్రదర్శించకుండా మిగిలిన పార్టీలలో ఒకటిగా ఉండాల్సిందే అని అంటున్నారు. రేపటి రోజున దేశంలో ఇండియా కూటమి గెలిస్తే కనుక ప్రధాన మంత్రి పదవికి కూడా కాంగ్రెస్ పోటీ పడకుండా ఉండాల్సిందే అన్న ప్రతిపాదనలు వచ్చిన అంగీకరించాల్సి ఉంటుంది. అంటే రాహుల్ గాంధీ ప్రధాని అన్న దానిని పక్కన పెట్టి త్యాగమూర్తిగా మారిపోవాల్సిందే అన్న మాట.

ఇంత చేసి దేని కోసం అంటే దేశం కోసం బీజేపీని ఓడించడం కోసం అన్న నినాదాన్ని కనుక కాంగ్రెస్ ఎత్తుకుంటే ఇండియా కూటమిని ఒక్కటిగా పటిష్టంగా ఉంచేలా బాధ్యతలను నెత్తిన వేసుకుంటే మాత్రం ఏ రకమైన ఆశలు పెట్టుకోకుండా పనిచేయాల్సిందే అని అంటున్నారు. అపుడే ఇండియా కూటమి గట్టిగా నిలబడుతుందని అంటున్నారు. మరి కాంగ్రెస్ ఎందుకొచ్చిన కంచి గరుడ సేవ అని అనుకుంటే మాత్రం బీజేపీని గెలిపిస్తూ ఉండాల్సిందే అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.

Tags:    

Similar News