అన్ స్టాపబుల్... రాహుల్ గాంధీ బైక్ రైడ్!
ఈ సమయంలో గతంలో యూఎస్ లో ట్రక్ ఎక్కి హల్ చల్ చేసిన రాహుల్ గాంధీ... తాజాగా బైక్ రైడ్ చేపట్టారు
భారత్ జూడో యాత్ర నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పద్దతి పూర్తిగా మారిపోయిందని.. అప్పట్లో ఉన్నట్లుగా లేరని, జనాల్లో బాగా కలిసిపోతున్నారని, వయవహార శైలి కూడా పూర్తిగా మారిందనే కామెంట్లు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే విషయాలను ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా విమాన ప్రయాణంలో తన అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ సమయంలో గతంలో యూఎస్ లో ట్రక్ ఎక్కి హల్ చల్ చేసిన రాహుల్ గాంధీ... తాజాగా బైక్ రైడ్ చేపట్టారు. భారత్ - చైనా సరిహద్దుల్లో ఈ రైడ్ జరగడం గమానార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అవును... కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లోని లేహ్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్ - చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు కు శనివారం ఆయన బైక్ రైడ్ చేపట్టారు. ఈ సందర్భంగా రైడ్ ప్రారంభానికి ముందు రాహుల్ మాట్లాడారు. ఈ రైడ్ గురించి తనకున్న చిన్ననాటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా చేపట్టిన రైడ్ కు ముందు మాట్లాడిన రాహుల్ గాంధీ... "ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో పాంగాంగ్ సరస్సు ఒకటి అని మా నాన్న (రాజీవ్ గాంధీ) చెప్పేవారు" అని అన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కాంగ్రెస్ తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పంచుకుంది.
ఇక రైడ్ సందర్భంగా ఈ రాత్రికి ఆయన పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న టూరిస్ట్ క్యాంప్ లో బస చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 20న తన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఈ సరస్సు వద్దే చేసుకోనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.
కాగా... గత గురువారం రాహుల్ లేహ్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలుత రెండు రోజుల పాటే ఇక్కడ ఉండాలని భావించినా.. ఆగస్టు 25 వరకు తన పర్యటనను పొడిగించుకున్నారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రాహుల్ లద్దాఖ్ కు రావడం ఇదే తొలిసారి.