కేసీఆర్ నోరెత్తలేని విధంగా రాహుల్ కామెంట్లు!
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దగా చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాళేశ్వరం కట్టించి ఏడాది కూడా కాలేదని, అప్పుడే కూలిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఈ ప్రభుత్వం తీరు అర్థం చేసుకోవచ్చునన్నారు.
తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార హోరు జోరుగా సాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలూ తమ ముఖ్యనేతలను ప్రజాక్షేత్రంలోకి దించాయి. ఇలా తాజాగా కొల్లాపూర్‌లో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆసక్తికర కామెంట్లు చేశారు. అంతేకాకుండా అధికార బీఆర్ఎస్ పార్టీ తిరిగి స్పందించలేని రీతిలో ఆయన విరుచుకుపడ్డారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కొల్లాపూర్ లో ఏర్పాటు చేసిన 'పాలమూరు ప్రజాభేరి సభ'లో పాల్గొని మాట్లాడుతూ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. సీడబ్ల్యూసీ మీటింగ్ ఉండే.. దాన్ని వద్దనుకుని కొల్లాపూర్ కి వచ్చానని ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు.
కేసీఆర్ కుటుంబం ఒక వైపు.. తెలంగాణ సమాజం.. యువత.. మహిళ లు మరోవైపు ఉన్నారని పేర్కొన్న రాహుల్ గాంధీ ప్రజల తెలంగాణ… దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో సమాజం చూస్తూనే ఉందని రాహుల్ వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దగా చేసిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాళేశ్వరం కట్టించి ఏడాది కూడా కాలేదని, అప్పుడే కూలిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఈ ప్రభుత్వం తీరు అర్థం చేసుకోవచ్చునన్నారు. కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్, సింగూర్, జూరాల వంటి అనేక ప్రాజెక్టులు కట్టింది.మేము కట్టిన అన్ని ప్రాజెక్టులు చూడండి.. మరో వైపు కాళేశ్వరం చూడండి.. లక్ష కోట్లు కేసీఆర్ ప్రజల సొమ్ము దోచుకున్నాడు' అంటూ విరుచుకుపడ్డారు.
ఈ సందర్భంగా పలు సెంటిమెంట్ డైలాగ్‌లను సైతం రాహుల్ గాంధీ వదిలారు. పాలమూరు సభకు ప్రియాంక గాంధీ రావాల్సిందని.. కానీ, ఆమె ఆరోగ్యం బాగా లేకపోవడంతో రాలేకపోయారని చెప్పారు. ఇవాళ ఇందిరా గాంధీ వర్థంతి. మనది రాజకీయ బంధం కాదు..కుటుంబ బంధం. మా నానమ్మ కి తెలంగాణ అండగా నిలబడింది. మీరు పోరాడితే.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును.. మేము అధికారం లోకి రాగానే ప్రజల జేబులోకి వచ్చేలా చేస్తాం.' అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.